రాజకీయాలు అంటే మాటల యుద్ధం మాత్రమే కాదు.. ప్రజల ముందుండే నాయకుడి జీవనశైలి కూడా ఒక సందేశమే. 56 ఏళ్ల వయసులోనూ ఫిట్‌నెస్ విషయంలో రాహుల్ గాంధీ చూపిస్తున్న పట్టుదల ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. సభల్లో ప్రత్యర్థులపై విమర్శలు.. ప్రజా సమస్యలపై పోరాటాలు.. దేశవ్యాప్తంగా పర్యటనలు.. ఇవన్నీ ఒకవైపు ఉంటే.. తెర వెనుక తన శరీరాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు రాహుల్ ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. మార్షల్ ఆర్ట్స్.. స్విమ్మింగ్.. రన్నింగ్.. ఇప్పుడు యోగా.. ఇలా వ్యాయామ పద్ధతులను తన రోజువారీ జీవితంలో భాగం చేసుకున్నారు. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా ఫిట్‌నెస్‌కు గంట సమయం కేటాయిస్తానని ఆయన చెబుతున్నారు. అవసరమైతే రాత్రి 11 గంటలకైనా వ్యాయామం చేస్తానన్న మాట ఆయన క్రమశిక్షణను తెలియజేస్తోంది. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది.. వ్యాయామం ఒక్కటే ఆరోగ్యానికి సరిపోదని.. చెడు ఆహారం, అధిక మద్యం, తరచూ స్నాక్స్ తింటే ఫిట్‌నెస్ ఫలించదని రాహుల్ చేసిన హెచ్చరిక ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారింది.
మార్షల్ ఆర్ట్స్, యోగాతో శారీరక దారుఢ్యం
56 ఏళ్ల వయసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన ఫిట్‌నెస్ రహస్యాన్ని వెల్లడించారు. ఆరోగ్యంగా ఉండటానికి ప్రత్యేకమైన రొటీన్ కంటే నిరంతర సాధన, క్రమశిక్షణ, సమతుల్య జీవనశైలి ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా వ్యాయామానికి సమయం కేటాయిస్తానని చెప్పారు. అవసరమైతే రాత్రి 11 గంటలైనా వ్యాయామం చేస్తానని చెప్పడం ఆయన పట్టుదలను చూపిస్తోంది.తనకు మార్షల్ ఆర్ట్స్ అంటే ఇష్టమని రాహుల్ గాంధీ తెలిపారు. దాంతో పాటు ఈత, రన్నింగ్ కూడా చేస్తానని చెప్పారు. శరీరాన్ని చురుకుగా ఉంచేందుకు వివిధ రకాల వ్యాయామాలను కలిపి కొనసాగిస్తున్నట్లు వివరించారు. వయసు పెరుగుతున్న కొద్దీ ఫిట్‌నెస్‌పై మరింత శ్రద్ధ అవసరమనే సందేశాన్ని ఆయన తన జీవనశైలితోనే ఇస్తున్నారు. ఇటీవల యోగాను కూడా తన దినచర్యలో భాగం చేసుకున్నట్లు రాహుల్ వెల్లడించారు. శారీరక బలం, ఏరోబిక్ సామర్థ్యం, శరీర సౌలభ్యాన్ని పెంచుకోవడానికి రోజుకు సుమారు గంట సమయం కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఇది ఖాళీ సమయంలో చేసే పని కాదని, తన జీవితంలో తప్పనిసరి భాగంగా భావిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. పని ఎంత పెరిగినా ఫిట్‌నెస్‌కు ఇచ్చే సమయాన్ని తగ్గించనని తేల్చిచెప్పారు.
యువతే దేశానికి అసలైన శక్తి.. మద్యం, చెడు ఆహారం
ఫిట్‌నెస్ అంటే కేవలం వ్యాయామం చేయడం మాత్రమే కాదని రాహుల్ గాంధీ హెచ్చరించారు. చెడు ఆహారం తీసుకుంటూ, ఎక్కువగా మద్యం సేవిస్తూ, తరచూ స్నాక్స్ తింటూ ఉంటే ఎంత వ్యాయామం చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని చెప్పారు. వ్యాయామం, ఆహారం, అలవాట్లు — అన్నింటినీ సమతుల్యంగా చూసినప్పుడే ఆరోగ్యం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ‘ఛాత్రోంకీ గూంజ్’ కార్యక్రమంలోనూ రాహుల్ గాంధీ యువతపై ప్రశంసలు కురిపించారు. భారత యువత దేశానికి అతిపెద్ద బలం అని పేర్కొంటూ, యువతే దేశానికి శక్తి, గర్వకారణమని అన్నారు. ఫిట్‌నెస్ నుంచి యువత వరకు ఆయన తాజా వ్యాఖ్యలు ఒకే సందేశాన్ని ఇస్తున్నాయి—శరీరాన్ని బలంగా, ఆలోచనలను చురుకుగా ఉంచుకుంటేనే వ్యక్తిగతంగానూ, దేశపరంగానూ ముందుకు సాగగలం.