బొద్దింకల నెక్స్ట్ స్టెప్ ఏంటి?
యువతతో దేశవ్యాప్త యాత్ర.
ప్రజా ఉద్యమానికి దీప్కే ప్రణాళిక.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీసిన విద్యార్థి ఉద్యమంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఇప్పుడు తన తదుపరి కార్యాచరణపై దృష్టి సారించింది. ఆగస్టు 5 నుంచి ఛత్రపతి సంభాజీనగర్‌లో రెండు రోజుల వ్యూహాత్మక సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ సమావేశంలో వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, అధికార ప్రతినిధులు, కీలక నాయకత్వ బృందం పాల్గొని యువజన ఉద్యమ భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. జంతర్ మంతర్ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన 50 మంది ప్రధాన వాలంటీర్లతో పాటు వివిధ వర్గాల అభిప్రాయాలను ఇప్పటికే సేకరించినట్లు సీజేపీ వెల్లడించింది. సమావేశం అనంతరం దేశవ్యాప్తంగా వాలంటీర్లను కలుస్తూ యువత అవసరాలు, ఆశయాలను తెలుసుకునేందుకు ప్రత్యేక వినికిడి యాత్ర చేపట్టనున్నట్లు తెలిపింది. యువత ఏకమైతే అధికార అహంకారాన్ని కూడా ఓడించవచ్చని ఈ ఉద్యమం నిరూపించిందని సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ పేర్కొన్నారు. యువత ఆశలను కార్యాచరణగా మార్చే దిశగా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.
రాజకీయాలకు దూరం.. ఉద్యమానికే ప్రాధాన్యం
సీజేపీ రాజకీయ పార్టీగా మారబోదని వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టంచేశారు. ప్రస్తుతం రాజకీయ పార్టీలపై ప్రజల విశ్వాసం తగ్గుతోందని, ఈడీ, సీబీఐ వంటి సంస్థలతో పార్టీలను బలహీనపరుస్తున్న పరిస్థితుల్లో కొత్త పార్టీ ఏర్పాటు చేయడం తమ లక్ష్యం కాదని చెప్పారు. దేశానికి ఇప్పుడు అవసరం రాజకీయ పార్టీ కాదని, బలమైన ప్రజా ఉద్యమమని అభిప్రాయపడ్డారు. జంతర్ మంతర్ విద్యార్థి ఉద్యమంలో కొంతమంది బయటి వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా చొరబడి హింసకు పాల్పడ్డారని ఆరోపించారు. శాంతియుత నిరసనను చెడగొట్టేందుకు ముందుగానే కుట్ర జరిగిందని, ఢిల్లీ పోలీసుల వైఫల్యంపై ప్రశ్నలు లేవనెత్తారు. నిరసన ప్రాంగణంలో వేలాది నేరచరిత్ర కలిగిన వ్యక్తులు తిరిగినా పోలీసులు అడ్డుకోలేదని విమర్శించారు. ఈ పరిణామాలపై కేంద్ర హోంశాఖ కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ యువత ఆకాంక్షలను ప్రజా ఉద్యమంగా మలచడమే తమ ప్రధాన లక్ష్యమని సీజేపీ మరోసారి స్పష్టం చేసింది.
#CockroachJanataParty #CJP #AbhijeetDipke #YouthMovement #StudentProtest #JantarMantar #NationwideYouthYatra #PeoplesMovement #YouthIndia #IndianPolitics #CJPNews #YouthProtest #AbhijeetDipkeLatest











