Home AP వేగంగా గ్రేట్ గ్రీన్ వాల్‌ రెండు నెలలు టార్గెట్ హరితాంధ్రపై పవన్ ఫోకస్

వేగంగా గ్రేట్ గ్రీన్ వాల్‌ రెండు నెలలు టార్గెట్ హరితాంధ్రపై పవన్ ఫోకస్



ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనులను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. 2026–27 సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యాలను వచ్చే రెండు నెలల్లో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు. అటవీ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో జిల్లాల వారీగా మొక్కల పెంపకం, మడ అడవుల విస్తరణ, తాటి వనాల ఏర్పాటు పురోగతిని పరిశీలించారు. గత రెండేళ్లలో మడ అడవుల విస్తరణలో దేశంలో రెండో స్థానం సాధించడం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొంటూ అధికారులను అభినందించారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 8,888 హెక్టార్లలో గ్రీన్ వాల్ విస్తరణ చేపట్టనున్నట్లు తెలిపారు. వీబీజీ రామ్‌జీ పథకం కింద తీర ప్రాంత జిల్లాలకు మరో 70 లక్షల మొక్కలు కేటాయించినట్లు వెల్లడించారు.

తీర రక్షణకు పచ్చని కవచం

వాతావరణ మార్పుల కారణంగా తీర ప్రాంతాలు తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, వాటిని ఎదుర్కోవడంలో గ్రేట్ గ్రీన్ వాల్ కీలక పాత్ర పోషిస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలోని 1,053 కిలోమీటర్ల తీరప్రాంతం వెంబడి ఐదు కిలోమీటర్ల వెడల్పుతో పచ్చని రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది 5 వేల హెక్టార్లలో తాటి వనాలు, 305 హెక్టార్లలో మిష్టి–2 కింద మడ అడవుల పునరుద్ధరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. తీర ప్రాంతాల్లో గ్రామ వనాలు, సామాజిక వనాలు, వ్యవసాయ వనాల ఏర్పాటులో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని సూచించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అటవీకరణ చేపట్టి తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణతో పాటు భవిష్యత్ తరాలకు సురక్షితమైన సహజ వనరులను అందించడం ప్రభుత్వ లక్ష్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

 

#GreatGreenWall #AndhraPradesh #PawanKalyan #GreenAndhra #Afforestation #ForestDepartment #MangroveForests #MangroveRestoration #CoastalProtection #GreenBelt #ClimateChange #EnvironmentalProtection #CoastalAndhra #APDevelopment #GreenWallProject #APNews