కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తన విద్యకు సంబంధించిన అన్ని పత్రాలను బహిరంగంగా వెల్లడించేందుకు సిద్ధమని ప్రకటించారు. తన విదేశీ విద్యకు నిధులు ఎలా సమకూరాయనే అంశంపై ఆర్‌టీఐ దాఖలైన నేపథ్యంలో ఆయన స్పందించారు. తన స్కాలర్‌షిప్ పత్రాలు, విద్యారుణ వివరాలు, విద్యార్హతల రికార్డులు చూపించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో బీజేపీ నేతలు కూడా తమ విద్యార్హతలను ప్రజల ముందుకు తీసుకురావాలని సవాల్ విసిరారు. బోస్టన్ యూనివర్సిటీలో చదివే సమయంలో స్కాలర్‌షిప్ పొందానని, మిగిలిన ఖర్చులను విద్యారుణంతో భరించానని, ఆ రుణాన్ని ఇప్పటికీ చెల్లిస్తున్నానని వెల్లడించారు.
ఆందోళనలపై స్పష్టత
తన పోరాటం వ్యక్తులపై కాదని, వ్యవస్థలో పారదర్శకత కోసమేనని దీప్కే అన్నారు. నీట్–యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై చేపట్టిన ఉద్యమాన్ని ఇతర దేశాల రాజకీయ పరిణామాలతో పోల్చడం సరైందికాదని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం మాత్రమే తాము పోరాడుతున్నామని చెప్పారు. మహారాష్ట్రలో నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు. విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాడారని, వారిని వేధించడం తగదని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, తన విద్యకు సంబంధించిన అన్ని వివరాలు పరిశీలించాలనుకునే వారికి అందుబాటులో ఉంచుతానని అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు.
#AbhijeetDipke #CockroachJanataParty #CJP #BJP #NarendraModi #Modi #EducationRecords #EducationQualifications #Scholarship #EducationLoan #BostonUniversity #RTI #NEETUG2026 #NEETPaperLeak #StudentProtests #Maharashtra #EducationTransparency #IndianPolitics











