Home AP భోగాపురంతో ఉత్తరాంధ్రకు కొత్త రన్‌వే స్వర్ణాంధ్ర 2047కు నేటి నుంచే శ్రీకారం

భోగాపురంతో ఉత్తరాంధ్రకు కొత్త రన్‌వే స్వర్ణాంధ్ర 2047కు నేటి నుంచే శ్రీకారం


చంద్రబాబు విజన్‌తో పరుగెడుతున్న ఏపీ.
12 ఏళ్లలో 166 ఎయిర్‌పోర్టులు.. ఇదే కొత్త భారత్.
పేదల విమాన కలను నిజం చేస్తున్నాం.
ఏపీ అభివృద్ధికి మోదీ మరో మైలురాయి.
ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు.

స్వర్ణాంధ్ర విజన్-2047 సాకారానికి శనివారం కీలకమైన రోజుగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. రూ.17,912 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త ఊపు తీసుకొస్తాయని చెప్పారు. భోగాపురం ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్ర ఆర్థిక ప్రగతికి కొత్త రన్‌వేగా మారుతుందని స్పష్టం చేశారు. యువతకు ఉపాధి, పెట్టుబడులు, పరిశ్రమలకు ఇది కొత్త అవకాశాల వేదిక అవుతుందని వెల్లడించారు. సభ ప్రారంభానికి ముందు సింహాచలం అప్పన్న, పైడితల్లి అమ్మవారికి నమస్కారాలు తెలియజేసిన మోదీ, 13 వేల మంది గిరిజన మహిళలు ప్రదర్శించిన థింసా నృత్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు. అభివృద్ధిలోనే కాదు, సాంస్కృతిక వైభవంలో కూడా ఆంధ్రప్రదేశ్ కొత్త చరిత్ర సృష్టించిందని కొనియాడారు.

చంద్రబాబు విజన్‌కు మోదీ ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వేగం చంద్రబాబు విజన్‌కు నిదర్శనమని ప్రధాని మోదీ అన్నారు. కొత్త ప్రాజెక్టులు రాష్ట్రంలో ఎయిర్, రోడ్ కనెక్టివిటీని మరింత బలోపేతం చేస్తాయని చెప్పారు. భోగాపురం విమానాశ్రయానికి స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం గర్వకారణమని పేర్కొన్నారు. గతంలో విమానాశ్రయాలకు ఒకే కుటుంబం పేర్లు పెట్టేవారని, ఇప్పుడు దేశ మహనీయుల పేర్లతో ప్రజలకు గౌరవం కల్పిస్తున్నామని చెప్పారు. 2014కు ముందు దేశంలో కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా, గత 12 ఏళ్లలో మరో 166 కొత్త విమానాశ్రయాలను నిర్మించామని వెల్లడించారు. ఉడాన్ పథకం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు విమాన ప్రయాణం అందుబాటులోకి వచ్చిందన్నారు. తమ ప్రాంతం నుంచే విమానం ఎక్కే అవకాశాన్ని కల్పించడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.

రూ.18 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం

భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి రూ.4,727 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రధాని తెలిపారు. విశాఖపట్నం తర్లువాడలో సెమీకండక్టర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పవర్‌గ్రిడ్, సోలార్, విండ్ ఎనర్జీ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టులను ప్రారంభించారు. ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్యాకేజీలు, తాడిపత్రి నాలుగు లేన్ల బైపాస్, పెంచలకోన–ఎర్రపాడు హై లెవల్ బ్రిడ్జి పనులకు శ్రీకారం చుట్టారు. విశాఖ నుంచి కృష్ణపట్నం వరకు పోర్టుల అభివృద్ధి, మచిలీపట్నం, రామాయపట్నంలో కొత్త పోర్టుల నిర్మాణం కొనసాగుతోందని చెప్పారు. రాష్ట్రంలో రూ.లక్ష కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు వేగంగా అమలవుతున్నాయని వెల్లడించారు. సెమీకండక్టర్, డేటా సెంటర్లు, ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో భారీ పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రెట్టింపు వేగంతో ముందుకు సాగుతోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

 

#BhogapuramAirport #PMModi #NarendraModi #ChandrababuNaidu #AndhraPradesh #NorthAndhra #APDevelopment #SwarnaAndhra2047 #AirportDevelopment #APInfrastructure #UdaanScheme #AndhraPradeshProjects #AlluriSitaramaRajuAirport #NorthAndhraDevelopment #IndiaDevelopment