Home General సోషల్ మీడియాలో దూకుడు పెంచండి: యనమల

సోషల్ మీడియాలో దూకుడు పెంచండి: యనమల



తేటగుంట క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన తుని నియోజకవర్గ ఐటీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో తెలుగు దేశం పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పాల్గొన్నారు. ఐటీడీపీ సభ్యులు మరింత చురుకుగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సోషల్ మీడియా ప్రస్తుతం రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోందని, అందుకు అనుగుణంగా ఐటీడీపీ సభ్యుల పనితీరు మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. ఇకపై ఐటీడీపీ కార్యకలాపాలను ప్రతి వారం సమీక్షిస్తామని తెలిపారు. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా సమర్థంగా పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఐటీడీపీ పోస్టింగ్‌లన్నీ కేంద్ర పార్టీ కార్యాలయానికి అనుసంధానమవుతాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం సాధిస్తున్న విజయాలు, అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ప్రభుత్వ విప్ యనమల దివ్య కృషితో నియోజకవర్గానికి వచ్చిన నిధులు, ప్రతి గ్రామంలో జరిగిన అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. అలాగే ప్రతిపక్షం చేసే తప్పుడు ప్రచారాలకు వెంటనే సోషల్ మీడియాలో సమాధానం ఇవ్వాలని సూచించారు. సమావేశంలో యనమల రాజేష్, తుని మండల టీడీపీ అధ్యక్షుడు యినుగంటి సత్యనారాయణతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

 

#YanamalaRamakrishnudu #ITDP #TDP #AndhraPradeshPolitics #TDPUpdates #SocialMediaCampaign #TeluguDesamParty #APPolitics #PoliticalNews #TDPLeaders