Home Political_News Leaders_politics రాజకీయ సెగలు

రాజకీయ సెగలు

Karimnagar
  • రణరంగంగా కరీంనగర్
  • గంగుల కార్యాలయంపై దాడి..
  • కౌశిక్ రెడ్డి కారు ధ్వంసం
  • రాజకీయ వ్యాఖ్యలతో రేగిన చిచ్చు
  • బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ

తెలంగాణలోని కరీంనగర్ పట్టణంలో రాజకీయ విభేదాలు భౌతిక దాడులకు దారితీయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే ఈ అల్లర్లకు కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలతో ఆగ్రహానికి గురైన బీజేపీ కార్యకర్తలు కరీంనగర్‌లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై ఒక్కసారిగా దాడికి దిగారు. కర్రలు, రాడ్లతో కార్యాలయ కిటికీలను పగులగొట్టడమే కాకుండా, అక్కడే ఉన్న కౌశిక్ రెడ్డి కారు అద్దాలను పూర్తిగా ధ్వంసం చేశారు. ప్రెస్ మీట్ ముగిసిన కొద్దిసేపటికే ఈ ఘటన జరగడంతో అంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

ఇరువర్గాల పరస్పర దాడులు – పోలీసుల లాఠీఛార్జ్
బీజేపీ శ్రేణులు కార్యాలయంలోకి చొచ్చుకురావడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రెండు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడులు చేసుకున్నారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులపై లాఠీఛార్జ్ చేశారు. ఘర్షణకు దిగిన బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య కౌశిక్ రెడ్డిని కరీంనగర్ నుండి హుజురాబాద్‌కు తరలించారు. అయినప్పటికీ, హుజురాబాద్‌లోని ఆయన క్యాంప్ కార్యాలయం వద్ద కూడా బీజేపీ శ్రేణులు దాడికి ప్రయత్నించడంతో అక్కడ కూడా ఉద్రిక్తత కొనసాగుతోంది. ప్రస్తుతం కరీంనగర్, హుజురాబాద్ ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.