ఆంధ్రప్రదేశ్‌లో చేనేత రంగ పునరుద్ధరణకు టీడీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పూర్వవైభవానికి నాంది పలుకుతున్నాయని టీడీపీ రాష్ట్ర నాయకులు సిద్ది బుచ్చేశ్వరరావు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో, మంత్రి నారా లోకేశ్ సారథ్యంలో చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత, చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాల కొండయ్య చేనేతల అభివృద్ధి కోసం పని చేస్తున్నారని ఆయన కితాబిచ్చారు. ‘నేతన్న సేవ’ పథకం ద్వారా అర్హులైన ప్రతి నేతన్నకు ఏటా రూ.25 వేల ఆర్థిక సాయం అందించడం చేనేత కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. ఇప్పటికే 50 ఏళ్లు దాటిన చేనేత కార్మికులకు నెలకు రూ.4 వేల ఎన్టీఆర్ భరోసా పెన్షన్, ఉచిత విద్యుత్, నూలు కొనుగోలుపై 15 శాతం సబ్సిడీ, త్రిఫ్ట్ ఫండ్‌కు ఆర్థిక సహాయం వంటి పథకాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. టెక్స్‌టైల్స్ పార్కులు, క్లస్టర్ల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఆప్కోకు బలోపేతం కల్పిస్తూ చేనేత ఉత్పత్తులకు మార్కెట్ విస్తరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ చర్యలతో రాష్ట్రంలో చేనేత రంగానికి మళ్లీ మంచి రోజులు వస్తాయని, వేలాది నేతన్న కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధి లభిస్తుందని సిద్ది బుచ్చేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు.