ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, మంత్రి లోకేష్ కి స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ ధన్యవాదాలు.
కర్నూలు :పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు, అంగన్వాడీ వర్కర్ల పిల్లలకు తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, మంత్రి నారా లోకేష్‌కు స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధన్యవాదాలు తెలిపారు. కర్నూలు జిల్లా పర్యటనలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 16,179 మంది పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు ఈ సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకం అమలవుతన్నట్లు చెప్పారు. అలాగే, 15 వేల మంది అంగన్వాడీ వర్కర్స్ పిల్లలకు కూడా ఈ పథకం వర్తిస్తుందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు పరుస్తోందని చెప్పారు.
గత ప్రభుత్వం హయాంలో దగాపడిన తల్లులకు న్యాయం చేయాలని రెండో విడత కింద తల్లికి వందనం పథకం నిధులు సీఎం చంద్రబాబు తల్లుల ఖాతాలో జమ చేశారన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు అమ్మ ఒడి పథకం ద్వారా పిల్లల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మాట మార్చి ఒక్క విద్యార్థికే డబ్బులు వేశారని గుర్తు చేశారు. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం మంత్రి నారా లోకేష్ ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం పథకం అమలు చేస్తామని చెప్పారని, ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం డబ్బులు ఇచ్చారన్నారు. ఇది నిజాయితీ గల ప్రభుత్వం అని చెప్పారు. ఈరోజు ఎంతో చారిత్రాత్మక దినంగా ఆయన పేర్కొన్నారు. తల్లికి వందనం పథకం తమ పిల్లలకు కూడా ఇవ్వాలని శానిటేషన్ వర్కర్స్ తనని అడిగారని, ఈ విషయాన్ని మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లగానే, ఆయన వెంటనే ఓకే చెప్పారన్నారు. గతేడాది కంటే ఈ ఏడాది అధికంగా తల్లికి వందనం పథకం కింద నిధులను ప్రభుత్వం ఇస్తున్నట్లు తెలిపారు.
గత ప్రభుత్వంలో ఏడాదికేడాది అమ్మ ఒడి పథకం లబ్దిదారులకు కోత పెట్టారని విమర్శించారు. అందుకు భిన్నంగా కూటమి ప్రభుత్వం ప్రతి ఏటా లబ్దిదారుల సంఖ్య పెంచుతోందని చెప్పారు. గత ప్రభుత్వంలో నాడు నేడు కింద భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయన్నారు. పిల్లల సంక్షేమాన్ని గాలికొదిలేసి డబ్బులు దోచుకున్నారని పట్టాభిరామ్ మండిపడ్డారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులపై మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించి, మెరుగైన వసతులు కల్పిస్తున్నారన్నారు. మెగా పేరెంట్స్ మీటింగ్ ద్వారా విద్యార్థులు తల్లిదండ్రులతో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కలసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారన్నారు. జగన్ ఏనాడైనా విద్యార్థుల తల్లిదండ్రులను కలిశారా? అని ప్రశ్నించారు. అబద్దాలు చెప్పడం వైసీపీ నైజం అని, ఇచ్చిన మాట నిలబెట్టు కోవడం మా విధానం అని ధీమాగా చెప్పారు. తల్లికి వందనం పథకం డబ్బులు జమ విషయంలో లోపాలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే, సరిదిద్దుతామన్నారు. మంత్రి నారా లోకేష్ చేస్తున్న అభివృద్ధిని చూసి నేర్చుకో జగన్ అని హితవు పలికారు. ఎల్ నినో ఎఫెక్ట్ సమయంలో రైతులను ఏవిధంగా ఆదుకోవాలో సీఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఢిల్లీలో ప్రధానమంత్రితో చర్చలు జరుపుతున్నట్లు చైర్మన్ పట్టాభిరామ్ చెప్పారు.
#ThallikiVandanam #ChandrababuNaidu #NaraLokesh #Pattabhiram #SanitationWorkers #AnganwadiWorkers #AndhraPradesh #EducationWelfare #StudentBenefits #AmmaVodi #Kurnool #CoalitionGovernment #SchoolEducation #WelfareSchemes #APPolitics











