Home AP గెలుపు కోసం బలహీనతలు జయించాలి

గెలుపు కోసం బలహీనతలు జయించాలి

కార్యకర్తల త్యాగాలు మరువొద్దన్న లోకేశ్.

టీడీపీ అధికారంలోకి రావడం వెనుక కార్యకర్తల పోరాటం, త్యాగాలే ప్రధాన బలమని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ఎన్నికల్లో గెలవాలంటే పార్టీకి ఉన్న బలాలను మరింత పెంచుకోవడంతో పాటు బలహీనతలను గుర్తించి అధిగమించాలని నేతలకు సూచించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన లీడర్‌షిప్‌ కాంక్లేవ్‌ ముగింపు సభలో ఆయన మాట్లాడారు. ‘పొలిటికల్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ పబ్లిక్‌ ఓరియంటేషన్‌’పై నేతలకు దిశానిర్దేశం చేశారు. సోషల్‌ మీడియాను తేలిగ్గా తీసుకోవద్దని, ప్రతి నేత చురుగ్గా వినియోగించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయాలని సూచించారు. చిన్న స్థాయి నాయకులు, ఏఎంసీ, కార్పొరేషన్‌ ఛైర్మన్లు కూడా తమ పనులను సోషల్‌ మీడియాలో వివరిస్తున్నారని గుర్తుచేశారు. రాజకీయ ప్రచారంలో సాంకేతికతను సమర్థంగా ఉపయోగించుకోవాలని చెప్పారు.

దుష్ప్రచారానికి వాస్తవాలతో కౌంటర్‌

సోషల్‌ మీడియా వినియోగానికి ప్రధాని నరేంద్ర మోదీని లోకేశ్‌ ఉదాహరణగా చూపారు. మోదీ సెల్ఫీ వీడియోల ద్వారా నేరుగా ప్రజలకు సందేశాలు ఇస్తున్నారని చెప్పారు. తాను కూడా సుజ్లాన్‌ విండ్‌ ప్రాజెక్టు శంకుస్థాపన, డీఎస్సీపై జరుగుతున్న దుష్ప్రచారానికి సెల్ఫీ వీడియోల ద్వారా వాస్తవాలను ప్రజల ముందుంచానని తెలిపారు. విషయం చిన్నదైనా, పెద్దదైనా ప్రజలకు నిజాలు వివరించడం నేతల బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురదజల్లేందుకు చేసే ప్రచారాన్ని సోషల్‌ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వైసీపీ నేతలు తమ పార్టీ అధినేతను గుడ్డిగా సమర్థిస్తున్నారని వ్యాఖ్యానించిన లోకేశ్‌.. టీడీపీ నేతలు మాత్రం భావోద్వేగాలకు కాకుండా వాస్తవాలతో ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్న అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. ప్రభుత్వం చేస్తున్న పనులకు ప్రజల్లో మరింత అవగాహన కల్పించేలా ప్రతి నాయకుడు సోషల్‌ మీడియాను ప్రచార సాధనంగా మార్చుకోవాలని లోకేశ్‌ దిశానిర్దేశం చేశారు.

 

#NaraLokesh #TDP #TDPLeadership #TDPLeaders #TDPLeadershipConclave #TDPCadre #CadreSacrifices #TDPElectionStrategy #TDPSocialMedia #SocialMediaPolitics #PoliticalCommunication #PublicOrientation #NaraLokeshSpeech #TDPGovernment #APGovernment #Amaravati #AmaravatiDevelopment #SocialMediaCampaign #CounterMisinformation #AndhraPradeshPolitics #APPolitics #TDPNews