Home AP సాయికృష్ణ కేసులో కీలక మలుపు మాజీ సీఐ కస్టడీకి కోర్టు అనుమతి

సాయికృష్ణ కేసులో కీలక మలుపు మాజీ సీఐ కస్టడీకి కోర్టు అనుమతి



ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ సీఐ నాగరాజును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కస్టడీకి ఇవ్వాలని విజయవాడ కోర్టు అనుమతించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నాగరాజును వారం రోజుల పాటు సిట్ అధికారులు విచారించనున్నారు.

కోర్టు విధించిన షరతులు

ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే నాగరాజును విచారించాలని కోర్టు స్పష్టం చేసింది. విచారణ ముగిసిన తర్వాత ఆయనకు భద్రత కల్పించాలని ఆదేశించింది. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంచాలని కూడా సూచించింది. విచారణ మొత్తం ఆడియో, వీడియో రూపంలో రికార్డు చేయాలని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది.

సిట్ కార్యాలయానికి తరలింపు

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న నాగరాజును కోర్టు అనుమతి తర్వాత సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకుని కార్యాలయానికి తరలించనున్నారు. లాకప్ డెత్‌కు సంబంధించిన కీలక అంశాలపై ప్రశ్నించనున్నారు. కస్టడీ విచారణలో వెలుగులోకి వచ్చే వివరాలు కేసు దర్యాప్తులో కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సాయికృష్ణ పిన్ని ఆరోపణలు

ఇదిలా ఉండగా సాయికృష్ణ పిన్ని, న్యాయవాది కనకదుర్గ సంచలన వ్యాఖ్యలు చేశారు.సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి తరచూ భిన్నంగా మాట్లాడుతున్నారని చెప్పారు. హేబియస్ కార్పస్ పిటిషన్‌ను ఉపసంహరించుకోలేదని, సీబీఐ విచారణ వద్దని మాత్రమే చెప్పినట్లు తన అక్క వివరించిందని కనకదుర్గ తెలిపారు. హత్య కేసును క్వాష్ చేయాలని పిటిషన్ వేయడం ఎన్నడూ చూడలేదని వ్యాఖ్యానించారు. కేసును నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరిగితే మానవ హక్కుల కమిటీ, బార్ అసోసియేషన్‌తో కలిసి న్యాయ పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.

 

#SaikrishnaCase #GadeSaikrishna #SaikrishnaLockupDeath #LockupDeath #FormerCI #Nagaraju #SIT #SITInvestigation #AndhraPradesh #APPolice #VijayawadaCourt #SupremeCourt #PoliceCustody #RajahmundryCentralJail #Kanakadurga #HumanRights #CrimeNews #APNews #AndhraPradeshNews