ఆత్మహత్య కాదు, మద్యం మత్తే కారణం!
సూసైడ్ అంటూ మొదట ప్రచారం.
మందు ఫుల్లుగా కొట్టడం వల్లేనా?
వైద్యుల నివేదికతో కొత్త మలుపు.
ఏది నిజం? ఏది అబద్ధం?
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఎం. ఉదయ్ కృష్ణారెడ్డి ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది. తొలుత ఆయన ఆత్మహత్యకు యత్నించినట్లు ప్రచారం జరిగినప్పటికీ, చికిత్స అందిస్తున్న వైద్యులు ఆ కథనాన్ని ఖండించారు. ఆదివారం రాత్రి అధికంగా మద్యం సేవించడంతోనే ఆయన స్పృహ కోల్పోయారని వెల్లడించారు. రక్త పరీక్షల్లో ఎలాంటి విషపదార్థాలు గుర్తించలేదని స్పష్టం చేశారు.
ఆస్పత్రి వైద్యుల వివరణ
ఎస్సార్ నగర్‌లోని జయంతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయన శరీరంలో విషపదార్థాల ఆనవాళ్లు లేవని పరీక్షల్లో తేలిందన్నారు. దీంతో ఆత్మహత్యాయత్నం జరిగిందన్న ప్రారంభ సమాచారం తప్పని వైద్యుల ప్రకటనతో స్పష్టమైంది. ఉదయ్ కృష్ణారెడ్డి ఎర్రగడ్డలోని మోతీనగర్‌లో కుటుంబ స్నేహితుడి ఇంట్లో స్పృహ తప్పి పడిపోయినట్లు ఆయన సోదరుడు వెల్లడించారు. గదిలో మద్యం సీసాలతో పాటు శానిటైజర్ బాటిళ్లు కనిపించడంతో రెండింటినీ కలిపి తాగి ఉంటాడేమోనని తొలుత కుటుంబ సభ్యులు అనుమానించినట్లు చెప్పారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించామని తెలిపారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని వెల్లడించారు.
లైంగిక వేధింపుల కేసు నేపథ్యం
మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆదివారం ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూన్ 23 నుంచి వేధింపులకు పాల్పడ్డారని, అసభ్యకర సందేశాలు పంపారని, వ్యక్తిగతంగా అవమానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసును జాతీయ పోలీస్ అకాడమీ కూడా తీవ్రంగా పరిగణించింది. ఫిర్యాదు, సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన ప్రివిలేజెస్ కమిటీ విచారణ పూర్తయ్యే వరకు ఆయనను సస్పెండ్ చేసింది. స్పృహ కోల్పోయే ముందు ఉదయ్ కృష్ణారెడ్డి సామాజిక మాధ్యమాల్లో స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొన్నారు. వాస్తవాలను నిర్ధారించకుండా వార్తలు ప్రసారం చేయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. చట్టంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని కూడా తన సందేశంలో పేర్కొన్నారు.
నిన్న ఆత్మహత్య.. నేడు మద్యం మత్తు!
ప్రచారం పరుగెత్తింది.. నిజం నడిచొచ్చింది
పోలీస్ అంటే ఆధారాలు చూసి కేసు నమోదు చేసే వ్యవస్థ. కానీ ఈసారి పోలీస్ అకాడమీకి చెందిన ఓ ట్రైనీ ఐపీఎస్ వ్యవహారంలో మాత్రం ఆధారాల కంటే ముందే ప్రచారమే పరుగు తీసింది. నిన్నటి వరకు “ఆత్మహత్యాయత్నం” అంటూ సంచలన శీర్షికలు మార్మోగాయి. సస్పెన్షన్.. లైంగిక వేధింపుల కేసు.. ప్రాణాలపై విరక్తి.. అంటూ కథలు క్షణాల్లో సోషల్ మీడియాను చుట్టేశాయి. కానీ ఒక్క వైద్యుల నివేదిక వచ్చేసరికి మొత్తం కథనం ఒక్కసారిగా తలకిందులైంది. విషం కాదు.. అధిక మద్యం సేవించడమే స్పృహ కోల్పోవడానికి కారణమని డాక్టర్లు తేల్చడంతో “నిన్న అలా.. నేడు ఇలా” అనే పరిస్థితి కనిపించింది. వార్తల ప్రపంచంలో ఊహాగానాలు ఎంత వేగంగా పరిగెడతాయో, వాస్తవాలు అంత నెమ్మదిగా నడుస్తాయనే మరో ఉదాహరణగా ఈ ఘటన నిలిచింది. అయితే ఇక్కడ అసలు కేసు మాత్రం ఇంకా ముగియలేదు. మహిళా ట్రైనీ ఐపీఎస్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు, వాటిపై నమోదైన పోలీసు కేసు, అకాడమీ అంతర్గత విచారణ యథావిధిగా కొనసాగుతున్నాయి. ఆరోపణలు చేసినవారి వాదన ఒకవైపు.. ఆరోపణలను ఖండిస్తున్న ట్రైనీ ఐపీఎస్ వివరణ మరోవైపు.. ఇప్పుడు నిజం ఏంటో చెప్పేది దర్యాప్తే. కోర్టు లేదా విచారణ తుది నిర్ణయం వెలువడకముందే తీర్పులు చెప్పే సోషల్ మీడియా కోర్టులు, సంచలన శీర్షికల పోటీ మరోసారి ప్రశ్నార్థకంగా మారాయి. ఈ ఘటన ఒక విషయాన్ని మాత్రం స్పష్టం చేసింది.. ప్రచారం ఒక్క క్షణంలో పుడుతుంది, కానీ నిజం మాత్రం ఆధారాలతోనే బయటపడుతుంది.











