Home National_news కొత్త అవతారమెత్తిన స్ట్రాటజిస్ట్ బీహార్ ఉప ఎన్నికలో పీకే కంటెస్ట్

కొత్త అవతారమెత్తిన స్ట్రాటజిస్ట్ బీహార్ ఉప ఎన్నికలో పీకే కంటెస్ట్

16


అంచనాలకందని ప్రాపర్టీ
గెలుపుపై లేదు షూరిటీ

శకునాలు చెప్పి రాజకీయాలను మలిచిన వ్యూహకర్తగా గుర్తింపు పొందిన ప్రశాంత్ కిశోర్.. ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల బరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బ్యాంకీపూర్ ఉప ఎన్నికలో నామినేషన్ దాఖలు చేసిన ఆయన అఫిడవిట్‌లో రూ.208 కోట్ల ఆస్తులను ప్రకటించడంతో బిహార్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేచింది.
బిహార్‌లోని బ్యాంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ సోమవారం తన నామినేషన్ దాఖలు చేశారు. ఇదే స్థానానికి బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హా కూడా నామినేషన్ సమర్పించారు. నామినేషన్ సందర్భంగా ఇరు పార్టీల నేతలు భారీ రోడ్ షోలు నిర్వహించారు. ఈ ఉప ఎన్నికకు జూలై 30న పోలింగ్ జరగనుండగా, ఆగస్టు 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.

రూ.208 కోట్ల ఆస్తుల వివరాలు

ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ప్రశాంత్ కిశోర్, ఆయన భార్య జాహ్నవి దాస్ పేర్లపై మొత్తం రూ.208.00 కోట్ల విలువైన చర, స్థిరాస్తులు ఉన్నాయి. ఇందులో ప్రశాంత్ కిశోర్ పేరుపై రూ.96 కోట్లకు పైగా ఆస్తులు ఉండగా, జాహ్నవి దాస్ పేరుపై రూ.111 కోట్లకు పైగా ఆస్తులు నమోదయ్యాయి. కుటుంబం మొత్తం కలిపి ఈ భారీ ఆస్తుల వివరాలను అఫిడవిట్‌లో వెల్లడించింది. జాహ్నవి దాస్ ఎంబీబీఎస్ పూర్తి చేసి ఢిల్లీలోని అపోలో ఇంద్రప్రస్థ ఆస్పత్రిలో సీనియర్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు. ఆమె వద్ద 475 గ్రాముల బంగారం, 200 గ్రాముల వెండి ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. వారి కుమారుడు దైబిక్ భరద్వాజ్ పేరుపై కూడా రూ.7.19 లక్షల చరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు.

కంపెనీ విరాళాల వివరాలు

ప్రశాంత్ కిశోర్ ఆధ్వర్యంలోని వేదాస్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఆయనకు వంద శాతం వాటా ఉంది. ఈ సంస్థ 2024–25లో జనసురాజ్ పార్టీకి రూ.85 కోట్ల విరాళం ఇచ్చినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. జనసురాజ్ ఫౌండేషన్‌కు రూ.50 లక్షలు, జాయ్ ఆఫ్ గివింగ్ గ్లోబల్ ఫౌండేషన్‌కు రూ.2.75 కోట్ల విరాళాలు ఇచ్చిన వివరాలను కూడా వెల్లడించారు. ప్రశాంత్ కిశోర్ హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో మాస్టర్ ఆఫ్ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్ పూర్తి చేశారు. అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ప్రత్యేక హెల్త్‌కేర్ శిక్షణ పొందారు. ఫ్రాన్స్‌లో ఇంటెన్సివ్ ఫ్రెంచ్ భాషా కోర్సు కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయనపై ఎనిమిది క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో ఎక్కువ కేసులు అక్రమంగా గుమికూడిన ఘటనలకు సంబంధించినవే. అయితే ఏ కేసులోనూ ఆయన దోషిగా తేలలేదు.

ఉప ఎన్నికపై దృష్టి

రాజ్యసభకు నితిన్ నవీన్ ఎన్నిక కావడంతో బ్యాంకీపూర్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఈ ఉప ఎన్నికను బిహార్ రాజకీయాల్లో కీలక పోరుగా భావిస్తున్నారు. రాజకీయ వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రశాంత్ కిశోర్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలవడం కూడా ఈ పోటీకి ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఆయన ఆస్తుల వివరాలు బయటకు రావడంతో ఎన్నికల ప్రచారంలో కొత్త చర్చ మొదలైంది.