తమిళనాడు సభలో హోరాహోరీ… విజయ్ వర్సెస్ స్టాలిన్

45

సభను ఊపేసిన సీఎం సైగలు
సినిమా డైలాగులొద్దన్న ఉదయనిధి
వ్యక్తిగత దాడులతో హీటెక్కిన అసెంబ్లీ

తమిళనాడు అసెంబ్లీ మంగళవారం అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర యుద్ధానికి వేదికైంది. ముఖ్యమంత్రి విజయ్ శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ దాదాపు 45 నిమిషాల పాటు సుదీర్ఘంగా మాట్లాడారు. డీఎంకే హయాంలో జరిగిన అవినీతిపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసిన తర్వాత విజయ్ ఒక వినూత్నమైన చేతి సైగ చేశారు. గతంలో డీఎంకే అధినేత ఎం.కె.స్టాలిన్ చేసిన ఒక వైరల్ సైగను అనుకరిస్తూ విజయ్ నవ్వడంతో సభలో నవ్వులు పూశాయి. ట్రెజరీ బెంచీలు చప్పట్లతో మార్మోగాయి.

సినిమా షూటింగ్ లాంటి అసెంబ్లీ
సభ బయట విజయ్ ప్రసంగంపై ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి ప్రసంగం కేవలం సోషల్ మీడియా రీల్స్ కోసమే పనికొస్తుందని ఎద్దేవా చేశారు. టీవీకే పార్టీ అసెంబ్లీని ఒక సినిమా థియేటర్‌గా మార్చేసిందని, సభ్యులు ఈలలు వేస్తున్నారని విమర్శించారు. త్వరలోనే మంత్రులు ఇక్కడ పాటలు పాడుతూ డ్యాన్సులు చేసినా ఆశ్చర్యం లేదన్నారు. విజయ్ చాలా కృత్రిమంగా నటిస్తున్నారని, స్పీకర్ ‘యాక్షన్’, ‘కట్’ చెబుతున్నట్లు ఉందని ఉదయనిధి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. త్వరలోనే ఇక్కడకు మేకప్ ఆర్టిస్టులు, స్టంట్ మాస్టర్లు కూడా వస్తారని, అసెంబ్లీని షూటింగ్ స్పాట్ చేస్తారని మండిపడ్డారు.

వ్యక్తిగత విమర్శలతో ఉదయనిధి కౌంటర్
రాజకీయ విమర్శల నుంచి ఉదయనిధి ఒక్కసారిగా విజయ్ వ్యక్తిగత జీవితంపైకి వెళ్లారు. ప్రతిపక్షాల వల్లే రైతులు నిరసనలు చేస్తున్నారని విజయ్ అనడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రైతులను అవమానించేలా విజయ్ చిన్న చిన్న కథలు చెబుతున్నారని ఆరోపించారు. విజయ్ కథలకు కౌంటర్‌గా.. చెంగల్పట్టు కోర్టులో భర్త కోసం వెతుకుతున్న భార్య కథ మాత్రమే తమిళనాడుకు తెలుసని సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన విషయాన్ని ఉదయనిధి పరోక్షంగా ప్రస్తావించారు.

కోర్టులో సాగుతున్న వివాహం ముగింపు
విజయ్, సంగీత దంపతుల 27 ఏళ్ల వివాహ బంధం ముగింపు దశకు చేరింది. భర్త నుంచి విడాకులు కావాలని కోరుతూ సంగీత డిసెంబర్ 2025లో చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ హైప్రొఫైల్ విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 7న జరగనుంది. ఈ వ్యక్తిగత వివాదాన్ని ఉదయనిధి రాజకీయ విమర్శలకు వాడుకోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రైతుల గౌరవాన్ని కాపాడటం చేతకాని ముఖ్యమంత్రి, తన సొంత విషయాలను దాచుకోలేకపోతున్నారంటూ ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.