సాయి కష్ణ లాకప్ డెత్ మిస్టరీ… సీఐ నాగరాజు అరెస్ట్

9

విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కస్టడీ మరణం కేసులో ఎట్టకేలకు కీలక ముందడుగు పడింది. కేసు విచారణకు సంబంధించి ఐజీపీ రవిప్రకాష్ నేతృత్వంలోని సిట్ అధికారులు వేగంగా కదిలారు. సాయికృష్ణను హింసించి చంపారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సస్పెండెడ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎస్.ఎస్.వి.వి. నాగరాజును మంగళవారం అరెస్ట్ చేశారు.

నాగరాజు నివాసం వద్ద ఉద్రిక్తత
అజిత్ సింగ్ నగర్‌లోని నాగరాజు నివాసం నుంచి ఆయన్ను అదుపులోకి తీసుకునే సమయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలీసులు రావడాన్ని గమనించిన నాగరాజు మద్దతుదారులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. పోలీసులకు అనుకూలంగా నినాదాలు చేస్తూ సిట్ వాహనాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ కాసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు అదనపు బలగాల సాయంతో ఆయన్ను టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తరలించారు.

సాక్ష్యాల ధ్వంసంపై తీవ్ర విచారణ
యువకుడిని చంపేసి శవాన్ని మాయం చేయడమే కాకుండా.. సాక్ష్యాలను కూడా పోలీసులు నాశనం చేశారు. పదిహేను రోజుల తర్వాత సాయికృష్ణ ఫోన్‌ను తల్లికి ఇస్తూ అందులోని కాల్ డేటా మొత్తం డిలీట్ చేశారు. పోలీస్ స్టేషన్‌లో సాయికృష్ణపై జరిగిన థర్డ్ డిగ్రీ హింసను చూసిన చందు అనే ప్రత్యక్ష సాక్షి ఒక వీడియోను విడుదల చేయడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. నిందితుడు నాగరాజుపై హత్య, అక్రమ నిర్బంధం, సాక్ష్యాల ధ్వంసం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు.

 

#GadeSaikrishna #CustodyDeathCase #VijayawadaNews #SITInvestigation #CINagaraju #PoliceCustodyDeath #AndhraPradeshNews #CrimeNews #BreakingNews #PoliceArrest #HumanRights #Vijayawada #CustodialViolence #SITProbe #JusticeForSaikrishna