మెదక్‌ జిల్లాలో ప్రతీకార జంటహత్యలు. ఈఎంఐ చిచ్చు.. ప్రాణస్నేహితుల మధ్య పగ

8

చిన్న ఆర్థిక వివాదంతో మొదలైన గొడవ

మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సురారం గ్రామంలో తీవ్ర కలకలం రేపిన జంట హత్యల కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో ప్రాణ స్నేహితులైన వై. శ్రీధర్, ఆర్. ప్రభు, (ప్రభాకర్) మధ్య ఉన్న చిన్నపాటి ఆర్థిక వివాదం, ఆపై కుటుంబ గొడవలే ఈ దారుణ హత్యలకు దారితీశాయి. ప్రభు బంధువుల నుంచి శ్రీధర్ ఒక ఆటోను ఈఎంఐ పద్ధతిలో తీసుకున్నాడు. అయితే రెండు నెలల ఈఎంఐ బకాయిల విషయంలో వీరిద్దరి మధ్య గొడవ మొదలైంది. ఈ క్రమంలోనే గతంలో ప్రభు.. శ్రీధర్‌పై హత్యాయత్నానికి కూడా పాల్పడగా అప్పట్లో పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ గొడవ ఇలా ఉండగానే శ్రీధర్‌కు వరుసకు చెల్లెలు అయ్యే అమ్మాయిని ప్రభు రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు, పగ మరింత తీవ్రరూపం దాల్చాయి.

లొకేషన్ షేర్ చేసుకుని దారుణ హత్య
ఈ వివాదాలను పరిష్కరించుకోవడానికి ఇద్దరూ ఒకచోట కలుసుకుని మాట్లాడుకుందామని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఒకరికొకరు లొకేషన్లు షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలో చేగుంట మండలం అనంతసాగర్ వద్దకు శ్రీధర్ బైక్‌పై రాగానే.. అప్పటికే పథకం ప్రకారం అక్కడ వేచి ఉన్న ప్రభు, అతని స్నేహితులు తుపాకుల మహేష్, సండ్రు గణేష్, చింతల ప్రశాంత్ ఆటోతో శ్రీధర్ బైక్‌ను బలంగా ఢీకొట్టారు. అనంతరం శ్రీధర్‌ను అక్కడే దారుణంగా హతమార్చి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి పరారయ్యారు. కన్నకొడుకు శ్రీధర్ హత్యకు గురయ్యాడనే విషయం తెలవడంతో తండ్రి కిషన్, బంధువులు ప్రతీకారంతో రగిలిపోయారు.

తండ్రిని చంపి వాగులో పడేసిన బంధువులు
శ్రీధర్ కుటుంబ సభ్యులు ప్రభుపై కక్షతో అర్ధరాత్రి వేళ అతని తండ్రి యాదగిరిని టార్గెట్ చేశారు. తూప్రాన్ వద్ద హోటల్‌లో ఉన్న యాదగిరిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు యాదగిరి మృతదేహాన్ని మాసాయిపేట మండలం కొప్పులపల్లి గ్రామ శివారులోని హల్దీవాగు డ్యామ్‌లో పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ దారుణ ఉదంతం వెలుగులోకి వచ్చింది.

గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు
హల్దీవాగు నుంచి వెలికితీసిన యాదగిరి మృతదేహాన్ని నర్సాపూర్ ఏరియా ఆసుపత్రికి, శ్రీధర్ మృతదేహాన్ని తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ జంట హత్యల నేపథ్యంలో సురారం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో భారీగా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు రెండు ఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.

 

#MedakCrime #DoubleMurderCase #SuraramVillage #SridharMurder #PrabhuCase #FamilyFeud #CrimeNews #TelanganaCrime #PoliceInvestigation #MedakDistrict #Chegunta #Toopran #MurderMystery #VillageTension #BreakingNews