సింధు జలాలు ఇవ్వండి.. లేదంటే యుద్ధం చేస్తాం

47
  • భారత్‌‌కు పాక్ రక్షణ మంత్రి వార్నింగ్
  • నీటి సంక్షోభంలో చిక్కుకున్న పొరుగు దేశం

సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారతదేశం రద్దు చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దేశ నీటి భద్రతకు ముప్పు వాటిల్లితే భారత్‌తో యుద్ధానికి వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. ఒక ప్రైవేట్ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ నీరు తమ జాతీయ భద్రతలో ఒక ముఖ్య భాగమని, దానికి నష్టం కలిగిస్తే సైనిక చర్యకు సిద్ధమవుతామని స్పష్టం చేశారు.

2028 నాటికి నీటి సరఫరా బంద్
భారత కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ ఇటీవల చేసిన ప్రకటన పాకిస్తాన్‌ను మరింత ఆందోళనలోకి నెట్టింది. 2028 నాటికి పాకిస్తాన్‌కు వెళ్లే సింధు నది నీటి ప్రవాహాన్ని పూర్తిగా నిలిపివేస్తామని ఆయన సూచించారు. నిర్దేశిత కాలపరిమితిలోగా పనులు జరుగుతున్నాయని, రాబోయే రోజుల్లో ఒక్క చుక్క నీరు కూడా పాకిస్తాన్‌కు వెళ్లదని పాటిల్ స్పష్టం చేయడంతో పాక్ రక్షణ మంత్రి ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తీవ్రవాద చర్యల వల్లే ఒప్పందం రద్దు
గతేడాది జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మరణించిన తర్వాత భారత్ 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది. సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్తాన్ పూర్తిగా స్వస్తి పలికే వరకు ఈ రద్దు కొనసాగుతుందని న్యూఢిల్లీ స్పష్టం చేసింది. భారత్ నీటిని ఒక ఆయుధంగా వాడుకుంటోందని, చీనాబ్ నది ప్రవాహాన్ని మార్చిందని పాక్ ఆరోపిస్తోంది.

పాకిస్తాన్‌లో అంతర్గత నీటి సంక్షోభం
ప్రస్తుతం పాకిస్తాన్ జనాభాలో దాదాపు మూడో వంతు మంది తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సింధ్, బలూచిస్తాన్ ప్రాంతాలు ఈ సంక్షోభం వల్ల తీవ్రంగా దెబ్బతిన్నాయి. సింధ్ ప్రాంతంలోని ప్రధాన కాలువలలో నీటి నిల్వలు 80 శాతం వరకు పడిపోయాయి. దీనికి తోడు పంజాబ్ ప్రాంతం తమకు కేటాయించిన వాటా కంటే ఎక్కువ నీటిని వాడుకుంటోందని సింధ్ అధికారులు అంతర్గత వివాదాలకు దిగుతున్నారు.

 

#Pakistan #IndiaPakistan #IndusWatersTreaty #KhawajaAsif #WaterCrisis #PakistanWaterCrisis #IndusRiver #ChenabRiver #CRPatil #JalShaktiMinistry #NationalSecurity #IndiaNews #PakistanNews #WaterDispute #PahalgamAttack #Terrorism #JammuAndKashmir #Sindh #Balochistan #PunjabPakistan #WaterShortage #Geopolitics #SouthAsia #InternationalNews #BreakingNews