Home Telangana ఆంధ్రకు నీళ్లు.. తెలంగాణకు ఎక్కిళ్లు!

ఆంధ్రకు నీళ్లు.. తెలంగాణకు ఎక్కిళ్లు!

పక్క రాష్ట్రాలకు నీటి కేటాయింపులు.
ప్రాజెక్టులు ఎండబెట్టి రైతులకు అన్యాయం.
తెలంగాణలో కరువు ఎందుకు?: కేటీఆర్.

తెలంగాణలో కరువు పరిస్థితులకు ప్రకృతి కంటే ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. నిర్మల్‌లో నిర్వహించిన రైతు గర్జన సభలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకు కరువు బృందాలు వెళ్తున్నాయి.. కానీ తెలంగాణలో కరువు బీజేపీకి ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. ఆంధ్రకు నీళ్లు అందుతుంటే తెలంగాణ రైతులకు ఎక్కిళ్లు ఎందుకని నిలదీశారు. 90 శాతం పూర్తయిన పాలమూరు ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పక్కనపెట్టిందని, కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ కక్షతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణకు దక్కాల్సిన 1,000 టీఎంసీల నీటిని కిందకు వదిలేస్తున్నారని మండిపడ్డారు. పట్టిసీమ ద్వారా చంద్రబాబు నీటిని తరలిస్తుంటే, కన్నెపల్లి వద్ద పంపులు ఎందుకు ప్రారంభించలేదని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. సదర్‌మాట్ బ్యారేజీ, శ్రీరాంసాగర్ బ్యాక్‌వాటర్‌ను సద్వినియోగం చేసుకుంటే నిర్మల్ జిల్లాలో కరువు వచ్చేది కాదన్నారు.

రైతులకు తక్షణమే పరిహారం ఇవ్వాలి

రైతులకు నీరు, విద్యుత్ అందించడంలో ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు. నాలుగు విడతల రైతుబంధు వెంటనే విడుదల చేయాలని, పంట రుణాలను రీషెడ్యూల్ చేయాలని, పెండింగ్ రుణమాఫీ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కరువు కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రతి వ్యవసాయ కూలీకి నెలకు రూ.1,000 చొప్పున 36 నెలలకు రూ.36 వేలు పరిహారం అందించాలని కోరారు. రైతులకు ధైర్యం చెప్పాల్సిన ముఖ్యమంత్రి రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారని మండిపడ్డారు. తెలంగాణకు నిధులు తీసుకురావడంలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు విఫలమయ్యారని విమర్శించారు. ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీ విక్రయం, నిర్మల్‌కు నవోదయ విద్యాలయం మంజూరు కాకపోవడంపై బీజేపీ నేతలను నిలదీశారు. తెలంగాణలో ఓట్లు కావాలి కానీ నిధులు ఇవ్వడానికి మనసు లేదా? అంటూ ప్రధాని మోదీని ప్రశ్నించారు. బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ప్రధాని ఇంటి ముందు ధర్నా చేయాలని సవాల్ విసిరారు.

 

#KTR #TelanganaDrought #TelanganaWaterCrisis #AndhraPradesh #WaterSharing #PalamuruProject #KaleshwaramProject #RythuGarjana #TelanganaFarmers #RythuBandhu #RevanthReddy #BRS #Nirmal