చెరువుల పునరుజ్జీవమే లక్ష్యం.
మూసీ ప్రక్షాళనకు సీఎం పిలుపు.
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో పునరుద్ధరించిన తమ్మిడి కుంట చెరువును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు సినీ నటుడు అక్కినేని నాగార్జున హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కొంతమందికి ఇబ్బందులు ఎదురైనా, భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలనే ఉద్దేశంతో తమ్మిడి కుంటను అభివృద్ధి చేశామని తెలిపారు. ఒకప్పుడు 14 ఎకరాలకు కుంచించుకుపోయిన చెరువును 30 ఎకరాలకు విస్తరించామని వెల్లడించారు. ఈ అభివృద్ధి కోసం అక్కినేని నాగార్జున మంచి మనసుతో ముందుకొచ్చి రెండు ఎకరాల భూమిని ప్రభుత్వానికి అందించారని ప్రశంసించారు. సినిమాల్లోనే కాదు.. నిజజీవితంలోనూ నాగార్జున నిజమైన హీరోగా నిలిచారని కొనియాడారు. నిన్నటి వరకు శిల్పారామం గురించి మాట్లాడుకున్న హైదరాబాద్ ప్రజలు.. ఇకపై తమ్మిడి కుంట గురించి మాట్లాడుకుంటారని, వర్క్ ఫ్రమ్ హోమ్‌కు బదులుగా వర్క్ ఫ్రమ్ తమ్మిడి కుంట అనే స్థాయిలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.
చెరువుల ఆక్రమణలతో నగరానికి ముప్పు
హైదరాబాద్ ఒకప్పుడు రాక్స్ అండ్ లేక్స్ సిటీగా గుర్తింపు పొందిందని, నగరంలో 1,372 చెరువులు ఉండగా వివిధ కారణాలతో సగానికి పైగా కనుమరుగయ్యాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. చెరువుల ఆక్రమణల కారణంగా వర్షాలు కురిసినప్పుడు రహదారులు నీటమునుగుతున్నాయని, కాలనీలు జలమయమవుతున్నాయని చెప్పారు. ఈ పరిస్థితిని ప్రతి ఒక్కరూ ఆలోచించాలని సూచించారు. గతంలో మూసీ వరదల నుంచి హైదరాబాద్‌ను రక్షించేందుకు నిజాం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించారని గుర్తుచేశారు. వికారాబాద్ ప్రాంతంలో ప్రారంభమయ్యే ముచుకుందా నది, మూసా, ఈసా నదుల సంగమంతో మూసీగా మారుతుందని వివరించారు. ప్రపంచంలోని అనేక నగరాలు నదీ నాగరికతల ఆధారంగా అభివృద్ధి చెందాయని, వందేళ్ల క్రితమే మూసీ పరివాహక ప్రాంత ప్రాధాన్యతను నిజాం గుర్తించారని తెలిపారు. అయితే నేడు మూసీ తీవ్ర కాలుష్యానికి గురైందని, దాని ప్రభావంతో నల్లగొండ జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
మూసీకి పునరుజ్జీవం.. రాజకీయాలకు అతీతంగా సహకారం
ప్రకృతి పరిరక్షణతో పాటు హైదరాబాద్‌ను విశ్వనగరంగా నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే చెరువుల పునరుద్ధరణ చేపట్టామని, సహకరించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సిందేనని, చెరువులను ఆక్రమణల చెర నుంచి విడిపించాల్సిందేనని స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవనంలో ఎవరికీ నష్టం జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదేనని హామీ ఇచ్చారు. త్వరలోనే తొలి దశ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. మూసీ సుందరీకరణ మాత్రమే తమ లక్ష్యం కాదని, నదికి సంపూర్ణ పునరుజ్జీవం కల్పించడమే ప్రధాన ఉద్దేశమని చెప్పారు. నగర ప్రజల జీవనంతో మూసీ నది విడదీయలేని సంబంధం కలిగి ఉందన్నారు. నదుల పేర్లను ఆడబిడ్డలకు పెట్టుకునే సంస్కృతి మనదని గుర్తుచేశారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉండాలని, అభివృద్ధి విషయంలో అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. తమ్మిడి కుంట వద్ద ప్రజలకు భద్రత కల్పించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఇక్కడ లేక్ ఎకానమీని అభివృద్ధి చేయాలని, చెరువు ఆవరణలో జమ్మి చెట్టు నాటాలని రంగనాథ్‌కు సూచించారు. భవిష్యత్తులో చెరువులు దసరా వేడుకలకు వేదికలుగా మారాలని, మన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
#ThammidikuntaLake #RevanthReddy #Nagarjuna #MusiRiver #MusiRejuvenation #Hyderabad #LakeRestoration #Telangana #LakeConservation #Madhapur #UrbanDevelopment #EnvironmentalProtection











