రామచంద్రరావుకు మంత్రి పొన్నం సవాల్.
ఓటర్ల జాబితా సవరణ పేరుతో అర్హులైన పౌరుల ఓటు హక్కు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆరోపిస్తూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావుకు సవాల్ విసిరారు. ఓటు హక్కు కోల్పోయామని ఆందోళన చెందుతున్న బాధితులను అవసరమైన ఆధారాలతో సహా మీ ముందుకు తీసుకొస్తా.. తేదీ, సమయం ప్రకటించండి అని డిమాండ్ చేశారు. పోలీసు బలగాలతో అరెస్టులు చేయించడం కాకుండా, బాధితుల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించాలని కోరారు. దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లు, హైదరాబాద్లో 40 లక్షల ఓట్లు, తెలంగాణలో 70 లక్షల ఓట్లు తొలగిపోయాయని ఆరోపించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఓట్లు తొలగించారనే ఆరోపణలపై స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తన ఓటు విషయంలోనూ తండ్రి పేరులో సత్తయ్య, సత్యనారాయణ గౌడ్ వంటి పేర్ల వ్యత్యాసాలను కారణంగా చూపి సమస్యలు ఎదురయ్యాయని పేర్కొన్నారు.
అర్హుల ఓట్లు కాపాడాల్సిందే
పేదలు, వృద్ధులు, నిరక్షరాస్యులు, రోజువారీ కూలీలు తమ ఓటు హక్కును నిరూపించుకోవడానికి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధార్ వంటి గుర్తింపు పత్రాలు ఉన్నప్పటికీ అదనపు ఆధారాలు కోరితే సామాన్యులు తమ హక్కును ఎలా కాపాడుకోవాలని ప్రశ్నించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఓటరు నమోదు, ఆధారాల సమర్పణపై చేసిన వ్యాఖ్యలను కూడా పరిశీలించాలని కోరారు. ఎన్ని ఓట్లు తొలగించారు? వాటిలో అనర్హుల ఓట్లు ఎన్ని? అర్హుల ఓట్లు పొరపాటున తొలగిపోయాయా? అనే వివరాలను ఎన్నికల సంఘం పారదర్శకంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. జాబితాలో తప్పులు ఉంటే సరిదిద్దాలి కానీ, అర్హుల ఓటు హక్కును తొలగించకూడదని స్పష్టం చేశారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్నవారిని అవమానించడం సరికాదన్నారు. “ఓటు బచావో – దేశ్ బచావో.. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం” అనే నినాదంతో అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కు పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
#PonnamPrabhakar #RamchanderRao #TelanganaPolitics #VoterRights #VoterListRevision #SIR #VoterDeletion #ElectionCommission #VotingRights #VoteBachaoDeshBachao #TelanganaBJP #Democracy #Constitution #HyderabadNews #PoliticalNews











