Home Technology వన్‌ప్లస్‌ ఇండియా వీడుతుందా?

వన్‌ప్లస్‌ ఇండియా వీడుతుందా?

61


మార్కెట్‌లో పెద్ద ఎత్తున ఊహాగానాలు.
భారత్‌లో కార్యకలాపాలు కొనసాగుతాయా?
అసలు విషయం చెప్పిన కంపెనీ.

వన్‌ప్లస్‌ భారత్‌ను వీడబోతోందన్న వార్తలపై కంపెనీ స్పష్టమైన ప్రకటన చేసింది. దేశంలో తమ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయని వెల్లడించింది. వ్యాపార నిర్వహణలో ఎలాంటి అంతరాయం లేదని తెలిపింది. ధృవీకరణ లేని కథనాలను ప్రచారం చేసే ముందు మీడియా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. దీంతో గత కొన్ని గంటలుగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టిన ఊహాగానాలకు కంపెనీ సమాధానం ఇచ్చినట్టైంది.

బ్లూమ్‌బర్గ్‌ కథనంతో చర్చ

బ్లూమ్‌బర్గ్‌ కథనం ప్రకారం వన్‌ప్లస్‌ అమెరికా, యూరప్‌ మార్కెట్ల నుంచి ఈ ఏడాదిలోనే వైదొలిగే అవకాశముందని పేర్కొంది. 2027 నాటికి భారత్‌లో కూడా కార్యకలాపాలు నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు వెల్లడించింది. ఈ కథనం వెలువడిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా టెక్‌ రంగంలో చర్చ మొదలైంది. ముఖ్యంగా భారత్‌లోని వన్‌ప్లస్‌ వినియోగదారుల్లో సందేహాలు నెలకొన్నాయి.

ఉత్తర అమెరికా, యూరప్‌లో కొత్త ఉత్పత్తులు లేవు

ఉత్తర అమెరికా, యూరప్‌ మార్కెట్లలో కొత్త ఉత్పత్తులను విడుదల చేయబోమని వన్‌ప్లస్‌ తెలిపింది. అయితే భారత్‌లో వ్యాపార కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది. దేశీయ మార్కెట్‌కు సంబంధించిన సేవలు, విక్రయాలు, వినియోగదారుల మద్దతు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొంది.

ఒప్పో పునర్వ్యవస్థీకరణ ప్రభావం

బ్లూమ్‌బర్గ్‌ కథనం ప్రకారం వన్‌ప్లస్‌ మాతృసంస్థ ఒప్పో చేపడుతున్న పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్టు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు మందగించడం, తయారీ ఖర్చులు పెరగడం, భౌగోళిక రాజకీయ పరిస్థితులు కఠినంగా మారడం కంపెనీపై ప్రభావం చూపుతున్నాయని విశ్లేషణలు చెబుతున్నాయి. ముఖ్యంగా చైనా ఉత్పత్తులపై అమెరికా కఠిన వైఖరి కూడా కీలక అంశంగా మారిందని నివేదికలు సూచిస్తున్నాయి.

సాఫ్ట్‌వేర్‌లో కీలక మార్పు

వన్‌ప్లస్‌కు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన ఆక్సిజన్‌ఓఎస్‌ స్థానంలో ఒప్పో కలర్‌ఓఎస్‌ను తీసుకురావాలని కంపెనీ నిర్ణయించినట్టు వెల్లడించింది. వినియోగదారులకు మెరుగైన సమగ్ర అనుభవం అందించడమే లక్ష్యమని తెలిపింది. ఈ మార్పు కంపెనీ వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణలో భాగమని భావిస్తున్నారు. ప్రస్తుతం భారత్‌ వన్‌ప్లస్‌కు అతిపెద్ద విదేశీ మార్కెట్‌గా కొనసాగుతోంది. అందువల్ల భారత కార్యకలాపాలు కొనసాగుతున్నాయని కంపెనీ ఇచ్చిన హామీ వినియోగదారులకు ఊరటనిచ్చింది.