Home Telangana 125 ఏళ్ల తర్వాత సమగ్ర భూసర్వే

125 ఏళ్ల తర్వాత సమగ్ర భూసర్వే

భూ వివాదాలకు చెక్.. 18 నెలల్లో రీ–సర్వే!
పర్యవేక్షణకు 14 మంది అధికారులు.

తెలంగాణలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సమగ్ర భూసర్వేను ఏడాదిన్నరలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా సర్వేలో వేగం, నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఏడు జోన్ల పర్యవేక్షణకు రెవెన్యూ, సర్వే విభాగాల నుంచి 14 మంది అధికారులను నియమించినట్లు తెలిపారు. మొత్తం 2,768 గ్రామాల్లో సర్వే చేపట్టగా, ఇప్పటివరకు 245 గ్రామాల్లో పూర్తయిందని వెల్లడించారు. తొలి దశ పనులను నవంబర్ చివరి నాటికి ముగించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రతి మండలంలో రెండు సర్వే బృందాలను ఏర్పాటు చేసి, తహసీల్దార్లు రోజువారీ పనులను పరిశీలించాలని సూచించారు.

డాష్‌బోర్డుతో పర్యవేక్షణ.. అక్రమ వసూళ్లపై హెచ్చరిక

సర్వే పురోగతి, గ్రామాల వారీగా పూర్తయిన పనులు, సర్వే బృందాలు, రోవర్ల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు హైదరాబాద్‌లో ప్రత్యేక డాష్‌బోర్డు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. అవసరమైన సాంకేతిక పరికరాల కొనుగోలుకు నిధుల కొరత ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్రస్థాయిలో ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తామని, ప్రతి 15 రోజులకు తాను స్వయంగా పురోగతిని పరిశీలిస్తానని తెలిపారు. ప్రభుత్వ భూముల సరిహద్దుల గుర్తింపులో సంబంధిత శాఖల అధికారులు పాల్గొనాలని సూచించారు. రీ–సర్వే పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఎర్రవల్లి భూములపై మంత్రి కీలక వ్యాఖ్యలు

మీడియాతో మాట్లాడిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎర్రవల్లిలో 385 ఎకరాలకు సంబంధించిన సర్వేలో 45 ఎకరాల తేడా గుర్తించినట్లు తెలిపారు. మరోసారి నోటీసులు జారీ చేశామని వెల్లడించారు. అక్కడ అసైన్డ్ భూములు చేతులు మారిన అంశాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అసైన్డ్ భూములను గుర్తించి, అర్హులైన పేదలకు పంపిణీ చేసే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అమరవీరులను గుర్తించి వారికి న్యాయం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

#TelanganaLandResurvey #Telangana #RevanthReddy #PonguletiSrinivasReddy #LandSurvey #LandDisputes #LandRecords #RevenueDepartment #Eravalli #AssignedLands #DigitalLandRecords #TelanganaNews #GovernmentInitiative #LandRights #PoliticalNews