సుశీ ఇన్‌ఫ్రా పిటిషన్లపై కీలక ఆదేశాలు..
టెండర్ల ఖరారుపై న్యాయస్థానం కీలక ఆదేశాలు.
హైదరాబాద్‌లో రేడియల్ రోడ్డు–2 నిర్మాణ కాంట్రాక్టుల వ్యవహారం హైకోర్టుకు చేరింది. సాంకేతిక బిడ్‌లో తమను అనర్హులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ సుశీ ఇన్‌ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ దాఖలు చేసిన మూడు పిటిషన్లపై జస్టిస్ బి. విజయసేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. ఇప్పటికే టెండర్లకు సంబంధించి ఏవైనా నిర్ణయాలు తీసుకుని ఉంటే అవి కోర్టు తదుపరి ఉత్తర్వులకు లోబడి ఉంటాయని స్పష్టం చేశారు. టెండర్ల ఖరారు ఆధారంగా కాంట్రాక్టుదారులు ప్రత్యేక న్యాయపరమైన హక్కులు కోరడానికి వీల్లేదని పేర్కొన్నారు. తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేశారు.
అనర్హతపై సుశీ ఇన్‌ఫ్రా అభ్యంతరం
కొత్వాల్‌గూడ (బుద్వేల్) నుంచి నాచారం సమీపంలోని జాతీయ రహదారి–167ఎన్ వరకు 81.15 కిలోమీటర్ల రేడియల్ రోడ్డు నిర్మాణానికి హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ మూడు ప్యాకేజీలుగా టెండర్లు పిలిచింది. అనుభవ ధ్రువీకరణ పత్రంపై సూపరింటెండింగ్ ఇంజినీర్ కౌంటర్ సంతకం లేదనే కారణంతో సుశీ ఇన్‌ఫ్రా బిడ్‌ను అధికారులు తిరస్కరించారు. అయితే తమకు కేంద్ర రహదారుల శాఖ ప్రాంతీయ కార్యాలయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పత్రం జారీ చేశారని, నిబంధనల ప్రకారం లోపాలపై వివరణ కోరాల్సి ఉన్నా ఆ అవకాశం ఇవ్వలేదని సంస్థ తరఫు న్యాయవాది వాదించారు. మరోవైపు, సాంకేతిక, ధరల బిడ్ల ప్రక్రియ పూర్తయిందని, ఎల్–1 బిడ్డర్‌ను కూడా ప్రకటించామని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఐతే, టెండర్లలో అధిక ధరలకు కాంట్రాక్టులు ఖరారు చేయడం వల్ల ప్రభుత్వానికి సుమారు రూ.600 కోట్ల నష్టం వాటిల్లుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ బిడ్‌ను నిబంధనలకు విరుద్ధంగా తిరస్కరించారని సుశీ ఇన్‌ఫ్రా న్యాయం కోరుతోంది. టెండర్ల ప్రక్రియపై తదుపరి విచారణలో హైకోర్టు ఏం నిర్ణయిస్తుందన్నది కీలకంగా మారింది.
#HyderabadRadialRoad2 #TelanganaHighCourt #SushieInfra #RadialRoadTenders #HyderabadGrowthCorridor #Telangana #TenderDispute #InfrastructureProjects #RoadConstruction #NH167N #HighCourtOrder #TelanganaNews #HyderabadNews #GovernmentTenders #LegalNews











