రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట
కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో కీలక ఊరట లభించింది. సావర్కర్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్యలతో మత విద్వేషాన్ని రెచ్చగొట్టారంటూ ఉత్తరప్రదేశ్‌లో దాఖలైన ప్రైవేట్ క్రిమినల్ ఫిర్యాదును సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఈ కేసులో అవసరమైన ప్రభుత్వ అనుమతి తీసుకున్నట్లు ఎలాంటి ఆధారం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ శీల్ నాగు ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో కూడా అనుమతికి సంబంధించిన వివరాలు లేవని అదనపు సొలిసిటర్ జనరల్, ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది వెల్లడించిన నేపథ్యంలో కేసును రద్దు చేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.
సావర్కర్‌పై రాహుల్ ఏం అన్నారు?
ఈ కేసు 2022 నవంబర్ 17న రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సందర్భంగా చేసిన వ్యాఖ్యల ఆధారంగా నమోదైంది. వీర్ సావర్కర్ బ్రిటిష్ పాలకులకు సహకరించారని, బ్రిటిష్ ప్రభుత్వం నుంచి పెన్షన్ కూడా పొందారని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు మతాల మధ్య విద్వేషాన్ని పెంచేలా ఉన్నాయని ఆరోపిస్తూ న్యాయవాది నృపేంద్ర పాండే ఉత్తరప్రదేశ్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో మేజిస్ట్రేట్ రాహుల్‌కు సమన్లు జారీ చేశారు. ఆయనపై అప్పటి భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 153A కింద వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, సెక్షన్ 505 కింద ప్రజల్లో అపోహలు లేదా అశాంతికి దారితీసే వ్యాఖ్యలకు సంబంధించిన ఆరోపణలు నమోదయ్యాయి. ఈ సమన్లను రద్దు చేయాలని రాహుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సాంకేతిక లోపమే కేసుకు ముగింపు
సుప్రీంకోర్టు ఈ దశలో రాహుల్ వ్యాఖ్యల వాస్తవం, సావర్కర్ చరిత్రపై రాజకీయ వివాదం వంటి అంశాల్లోకి వెళ్లలేదు. కేసు కొనసాగించేందుకు అవసరమైన అనుమతి తీసుకోలేదన్న అంశాన్నే ప్రధాన కారణంగా పరిగణించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌లో అనుమతికి సంబంధించిన సమాచారం లేకపోవడంతో ఫిర్యాదు, మేజిస్ట్రేట్ జారీ చేసిన ఉత్తర్వులు రెండింటినీ ధర్మాసనం రద్దు చేసింది. దీంతో సావర్కర్ వ్యాఖ్యలపై రాహుల్ ఎదుర్కొంటున్న ఈ ప్రత్యేక క్రిమినల్ కేసుకు ప్రస్తుతానికి ముగింపు పడింది. అయితే సావర్కర్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వివాదం మాత్రం కొనసాగుతూనే ఉంది. కోర్టు తీర్పు వ్యాఖ్యలు సరైనవా కాదా అన్న దానిపై కాకుండా.. కేసు నమోదు, కొనసాగింపుకు అవసరమైన చట్టపరమైన అనుమతి లేకపోవడంపైనే ఆధారపడింది.
#RahulGandhi #Savarkar #SupremeCourt #RahulGandhiCase #SavarkarRemarks #SupremeCourtVerdict #BharatJodoYatra #Congress #VeerSavarkar #UttarPradesh #CriminalCase #IndianPolitics #PoliticalNews











