Home AP స్థానిక సమరానికి సిద్ధం కండి

స్థానిక సమరానికి సిద్ధం కండి

సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోండి.
వార్‌రూమ్‌లు ఏర్పాటు చేయండి.
నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూడొద్దన్న సజ్జల.

స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఇప్పటి నుంచే పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని పార్టీ స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ఆదివారం పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూడకుండా అభ్యర్థుల కుల ధ్రువీకరణ పత్రాలు, నో డ్యూస్‌ సర్టిఫికెట్లు ముందుగానే సిద్ధం చేసుకోవాలని కోరారు. సర్టిఫికెట్ల జారీలో అధికారులు జాప్యం చేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక ఎన్నికల వార్‌రూమ్‌లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.

నామినేషన్‌ నుంచి కౌంటింగ్‌ వరకు నిఘా

ప్రతి గ్రామానికి న్యాయ సహాయం అందేలా లీగల్‌ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలని సజ్జల సూచించారు. నామినేషన్ల నుంచి ఓట్ల లెక్కింపు వరకు న్యాయ బృందాలు అప్రమత్తంగా ఉండాలని, రిజర్వేషన్ల రోస్టర్‌ను క్షుణ్ణంగా పరిశీలించి అవకతవకలపై న్యాయపోరాటం చేయాలని పేర్కొన్నారు. ఎన్నికల అక్రమాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు న్యాయపరంగా ఎదుర్కోవాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అభ్యర్థులపై పోలీసుల వేధింపులు, బైండోవర్‌ కేసులను ఆధారాలతో నమోదు చేయాలని, నిబంధనల ఉల్లంఘనలను వీడియోల్లో బంధించాలని కోరారు. ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక మీడియా, డిజిటల్‌ బృందాలను ఏర్పాటు చేసి ఎన్నికల పరిణామాలపై నిరంతరం దృష్టి పెట్టాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

#SajjalaRamakrishnaReddy #YSRCP #APLocalBodyElections #AndhraPradeshElections #YSRCPPreparation #ElectionWarRoom #PanchayatElections #CasteCertificates #ElectionMonitoring #ReservationRoster #ElectionCommission #APPolitics #AndhraPradeshNews