డ్యాన్స్ చిత్రీకరణలో ప్రమాదం, ఆరు వారాలు పూర్తి విశ్రాంతి
పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రశ్మిక మందన్న డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆమె రణబాలి, మైసా చిత్రాల షూటింగ్‌లలో బిజీగా ఉన్నారు. వరుసగా యాక్షన్ సన్నివేశాలు, డ్యాన్స్ ప్రదర్శనల్లో పాల్గొనడం వల్ల ఆమె హిప్ భాగంలో టెండన్ పూర్తిగా విడిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ గాయం తీవ్రత వైద్యులను కూడా ఆశ్చర్యానికి గురి చేసినట్లు సమాచారం. ఇలాంటి గాయాలు సాధారణంగా తీవ్రంగా సాధన చేసే క్రీడాకారుల్లోనే కనిపిస్తాయని వైద్యులు తెలిపారు. రశ్మిక కనీసం ఆరు వారాలు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. టెండన్ తిరిగి బలపడేందుకు ప్రత్యేక రీహాబిలిటేషన్ అవసరమని కూడా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది. రశ్మిక ప్రస్తుతం నాలుగు భారీ పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నారు. దాదాపు 30 బ్రాండ్‌లకు ప్రచారకర్తగా కూడా కొనసాగుతున్నారు. ఈ గాయం కారణంగా సినిమా షూటింగ్‌లు, ప్రకటనల చిత్రీకరణలు కొంతకాలం వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. ఆమె త్వరగా కోలుకుని తిరిగి షూటింగ్‌లకు రావాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.











