అఫ్గానిస్థాన్ క్రికెట్లో తనదైన ముద్ర వేసిన స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్.. దేశం కోసం ఓ మెగా టోర్నీ పతకం సాధించాలన్న తన కోరికను మరోసారి బయటపెట్టాడు. ఆసియా క్రీడల్లో అఫ్గానిస్థాన్ తరఫున ఆడి పతకం గెలవాలని ఎప్పటినుంచో ఆశపడ్డానని, ఈసారి జట్టులో చోటు దక్కకపోవడం బాధ కలిగించిందని చెప్పాడు. తనకు అవకాశం రాకపోవడం బహుశా అదృష్టంలో లేకపోయిందేమోనని వ్యాఖ్యానించిన రషీద్.. యువ జట్టులో ప్రతిభకు కొదవ లేదని, వారు దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించాడు. మరోవైపు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై రషీద్ ప్రశంసలు కురిపించాడు. అతడి వయసులోనే అనుభవజ్ఞులైన బౌలర్లను ఎదుర్కొంటూ భారీ సిక్సర్లు బాదడం సాధారణ విషయం కాదని అన్నాడు. వైభవ్‌లో ఉన్న పవర్ హిట్టింగ్, పరుగులు చేయాలన్న దూకుడు ప్రత్యేకమని పేర్కొన్నాడు. తన బౌలింగ్‌లో పరిస్థితులకు తగ్గట్టు లైన్, లెంగ్త్‌పై దృష్టి పెడతానని, ఒత్తిడిలోనూ సవాళ్లను ఆస్వాదిస్తానని తెలిపాడు. పెద్ద జట్లపై అఫ్గానిస్థాన్ తడబడుతున్నా.. ఆటగాళ్లు ఒత్తిడిని ఎదుర్కోవడం నేర్చుకుంటే మరింత బలమైన జట్టుగా ఎదుగుతారని రషీద్ విశ్వాసం వ్యక్తం చేశాడు.











