Home AP జనసేనకు దింపుడు కళ్లెం.. దామచర్లకు పక్కలో బాలినేని బల్లెం!

జనసేనకు దింపుడు కళ్లెం.. దామచర్లకు పక్కలో బాలినేని బల్లెం!

పాత పగకు కొత్త పొగ.
ఒంగోలు గిత్తల పోరు..
కూటమిలో కురుక్షేత్రం.


ఒంగోలు రాజకీయాలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి. దాదాపు ఒకటిన్నర దశాబ్దంగా బాలినేని శ్రీనివాసరెడ్డి, దామచర్ల జనార్దన్ మధ్య సాగుతున్న రాజకీయ పోరు ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఒకప్పుడు ఎన్నికల బరిలో నువ్వా–నేనా అన్నట్టుగా తలపడిన ఇద్దరూ.. ఇప్పుడు ఒకే కూటమి రాజకీయ పరిధిలో ఉండటం ఆసక్తికర పరిణామంగా మారింది. దామచర్ల టీడీపీ ఎమ్మెల్యేగా ఒంగోలులో తన పట్టును బలోపేతం చేసుకుంటుండగా.. బాలినేని వైసీపీని వీడి జనసేనలో చేరి కొత్త రాజకీయ స్థానం కోసం పోరాడుతున్నారు. 2024 ఎన్నికల్లో బాలినేనిపై విజయం సాధించిన దామచర్లకు.. ఇప్పుడు ప్రత్యర్థి జనసేనలోకి రావడం కొత్త సవాలు. బాలినేనికి మాత్రం తన పాత రాజకీయ బలం, అనుచర వర్గం, సుదీర్ఘ అనుభవాన్ని కొత్త పార్టీలో ఎలా మలచుకోవాలన్నదే అసలు పరీక్ష. ఉచిత ఇసుక వ్యవహారం సహా పలు అంశాలు ఈ ఇద్దరి మధ్య మళ్లీ మాటల యుద్ధానికి వేదికగా మారుతున్నాయి. విమర్శలు, హెచ్చరికలు పెరిగితే అది వ్యక్తిగత పోరును దాటి కూటమి అంతర్గత సమన్వయానికి పరీక్షగా మారే అవకాశం ఉంది. జనసేనలో బాలినేనికి గౌరవప్రదమైన స్థానం కల్పించడం ఒకవైపు.. ఒంగోలులో దామచర్ల ఆధిపత్యాన్ని సమన్వయం చేయడం మరోవైపు.. కూటమి నాయకత్వానికి పెద్ద సవాలే. పాత ప్రత్యర్థిత్వం కొత్త రాజకీయ సమీకరణాల్లో ఎలా పేలుతుందన్నదే ఇప్పుడు ఆసక్తి. బాక్సులు బద్ధలయ్యేలా సాగుతున్న ఈ గిత్తల పోరులో.. చివరకు పైచేయి ఎవరిది? కూటమి సమీకరణాలను ఎవరు తమకు అనుకూలంగా మలుచుకుంటారు? అన్నదే ఒంగోలు రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా నిలుస్తోంది.

హైమాండ్స్ వార్నింగ్స్
బోత్ ఆర్ నాట్ సేమ్
బాలినేని–దామచర్లకు రెడ్ సిగ్నల్
బహిరంగ విమర్శలొద్దని హితవు

ప్రకాశం జిల్లా రాజకీయాల్లో జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధంపై కూటమి అధిష్టానం సీరియస్‌గా స్పందించినట్లు సమాచారం. ఇరువురు నేతలు పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకోవడం కూటమి సమన్వయంపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావించిన పెద్దలు జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. అమరావతిలో జరిగిన కూటమి సమన్వయ కమిటీ టెలీకాన్ఫరెన్స్‌లో ఈ వివాదం ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.

ఇక బహిరంగ విమర్శలు వద్దు

దామచర్ల జనార్ధన్‌తో మంత్రి అచ్చెన్నాయుడు ఫోన్‌లో మాట్లాడి కూటమికి నష్టం కలిగించేలా వ్యవహరించవద్దని సూచించినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత సమస్యలు ఉంటే పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని, బహిరంగంగా విమర్శలు చేసుకోవద్దని స్పష్టం చేసినట్లు సమాచారం. బాలినేని శ్రీనివాసరెడ్డితోనూ జనసేన అగ్రనేతలు మాట్లాడి సంయమనం పాటించాలని సూచించినట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్న నేపథ్యంలో స్థానిక విభేదాలు కూటమి ఐక్యతను దెబ్బతీయకూడదన్నదే అధిష్టానం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. మరి ఈ హెచ్చరికతో బాలినేని–దామచర్ల వివాదానికి ఫుల్‌స్టాప్ పడుతుందా? లేక మళ్లీ మాటల యుద్ధం మొదలవుతుందా? అనేది ఆసక్తిగా మారింది.

జనార్దన్.. జనసేన లేకుంటే
గెలిచేవాడివా.. డోస్ పెంచిన బాలినేని
ఇండిపెండెంట్‌గా పోటీ.. 30 వేల మెజార్టీ
దమ్ముంటే రా.. బాలినేని ఓపెన్‌ ఛాలెంజ్‌..!

ఒంగోలు రాజకీయాల్లో మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. దామచర్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తనతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని బాలినేని సవాల్‌ విసిరారు. తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే 30 వేల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. జనసేన మద్దతు లేకుండా దామచర్ల ఎమ్మెల్యేగా గెలిచేవారా అని ప్రశ్నించారు. తనపై అవినీతి ఆరోపణలు ఉంటే సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసి విచారణ చేయించాలని బాలినేని కోరారు. తాను కూడా దామచర్లపై వచ్చిన ఆరోపణలపై విచారణకు సిద్ధమని చెప్పారు. ఒంగోలు కార్పొరేషన్‌లో రూ.8.5 కోట్ల నిధులు ఏమయ్యాయో దామచర్ల సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తన అనుచరులను కేసులతో వేధిస్తున్నారని ఆరోపించారు. ఆరోపణలపై కాణిపాకంలో ప్రమాణం చేయడానికి సిద్ధమని, దామచర్ల కూడా సిద్ధమైతే సమయం నిర్ణయించుకోవాలని సవాల్‌ విసిరారు. దీంతో ఒంగోలు రాజకీయాల్లో బాలినేని–దామచర్ల వివాదం మరింత వేడెక్కింది.

 

#OngolePolitics #BalineniSrinivasaReddy #DamacharlaJanardhan #TDP #JanaSena #BJP #AndhraPradeshPolitics #OngoleMLA #TDPJanaSenaAlliance #APAlliancePolitics #BalineniVsDamacharla #OngolePoliticalWar #AllianceCoordination #ChandrababuNaidu #Achchennaidu #JanaSenaPolitics #TDPPolitics #PrakasamPolitics #PoliticalNews