Home AP ఏపీ పీపీపీ పాలసీ-2026 విడుదల

ఏపీ పీపీపీ పాలసీ-2026 విడుదల


రూ.1,500 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్.
భారీ పెట్టుబడులకు ప్రభుత్వం కొత్త విధానం.

రాష్ట్రంలో ప్రైవేట్ పెట్టుబడులను భారీగా ఆకర్షించడంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధిని వేగవంతం చేసే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీపీ పాలసీ-2026ను ప్రకటించింది. స్వర్ణాంధ్ర విజన్‌-2047 లక్ష్యాలకు అనుగుణంగా ఈ విధానాన్ని రూపొందించినట్లు ప్రభుత్వం తెలిపింది. రవాణా, లాజిస్టిక్స్, పోర్టులు, విమానాశ్రయాలు, పట్టణ మౌలిక వసతులు, వైద్యం, విద్య, పరిశ్రమలు, పునరుత్పాదక ఇంధనం, పర్యాటకం వంటి రంగాల్లో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టులను ప్రోత్సహించనున్నారు.

రూ.1.23 లక్షల కోట్ల ప్రాజెక్టులు
రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు రూ.1.23 లక్షల కోట్ల విలువైన పీపీపీ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ ప్రాజెక్టులను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళిక, అంచనా, టెండర్ల ప్రక్రియ, అమలు, పర్యవేక్షణకు స్పష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.1,500 కోట్ల స్టేట్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌ (వీజీఎఫ్)ను ప్రభుత్వం కేటాయించింది. ప్రారంభ దశలో పూర్తిగా ఆర్థికంగా లాభదాయకంగా లేకపోయినా భవిష్యత్తులో ఆదాయం సమకూర్చే అవకాశం ఉన్న ప్రాజెక్టులకు ఈ నిధులు ఉపయోగించనున్నారు. అవసరమైన చోట ప్రాజెక్ట్ వయబిలిటీ బ్రిడ్జి ఫండ్‌ ద్వారా వడ్డీలేని రుణ సదుపాయం కల్పించే విధానాన్ని కూడా ప్రతిపాదించారు.

ప్రైవేట్ రంగ నైపుణ్యాలకు ప్రాధాన్యం
ప్రైవేట్ సంస్థల పెట్టుబడులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నిర్వహణ సామర్థ్యాలను ప్రజా మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగించుకోవడమే పాలసీ లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. దీనివల్ల ప్రజలకు మెరుగైన సేవలు అందడంతో పాటు పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని తెలిపింది. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పీపీపీ విధానాలను పరిశీలించి, వివిధ వర్గాల సూచనలు తీసుకున్న తర్వాతే పాలసీ-2026ను రూపొందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు ఈ విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

 

#AndhraPradeshPPPPolicy2026 #APPPPPolicy #PublicPrivatePartnership #AndhraPradeshInvestments #ViabilityGapFunding #VGF #InfrastructureDevelopment #PrivateInvestments #SwarnandhraVision2047 #APGovernment #Logistics #Ports #Airports #RenewableEnergy #Tourism #Healthcare #Education #IndustrialDevelopment