సూర్యతో కొత్త శక్తి.. రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు.
విశాఖపట్నం వేదికగా భారత రక్షణ రంగంలో మరో కీలక అధ్యాయం మొదలైంది. హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో దేశంలోనే తొలి స్వదేశీ ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘ఐఎన్ఎస్ సూర్య’ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం ప్రారంభించారు. అదే కార్యక్రమంలో ఐదో ఫ్లీట్ సపోర్ట్ షిప్ ఎఫ్ఎస్ఎస్–5కు కీల్ వేశారు. అప్‌గ్రేడ్ చేసిన స్లిప్‌వే–4, 300 టన్నుల గోలియత్ క్రేన్‌ను కూడా ప్రారంభించారు. ఈ మూడు కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఎఫ్ఎస్ఎస్–1 ప్రారంభం సాధించిన విజయానికి ప్రతీక, ఎఫ్ఎస్ఎస్–5 కీల్ వేయడం సంకల్పానికి ప్రతీక, కొత్త స్లిప్‌వే పెరుగుతున్న సామర్థ్యానికి ప్రతీక అని వివరించారు. 43,500 టన్నుల సామర్థ్యం కలిగిన ఫ్లీట్ సపోర్ట్ షిప్‌లు సముద్రంలో ఉన్న యుద్ధ నౌకలకు ఇంధనం, ఇతర అవసరాలను అందిస్తూ నౌకాదళం ఎక్కువకాలం దూర ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు సహకరిస్తాయి.
విశాఖకు ప్రపంచస్థాయి హబ్ హోదా
విశాఖపట్నాన్ని ప్రపంచంలోని ప్రముఖ మారిటైమ్ ఇండస్ట్రియల్ హబ్‌గా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఈ నగరంలో తూర్పు నౌకాదళ కమాండ్, నేవల్ డాక్‌యార్డ్, హిందుస్థాన్ షిప్‌యార్డ్, విశాఖ పోర్టు వంటి కీలక వ్యవస్థలు ఉన్నాయని గుర్తుచేశారు. వీటితో పాటు ఏపీకి చెందిన ఎంఎస్ఎంఈలు, విశ్వవిద్యాలయాలు, టెక్నాలజీ సంస్థలు, స్టార్టప్‌లను అనుసంధానం చేసి సమగ్ర నౌకా నిర్మాణ వ్యవస్థను రూపొందించాలని సూచించారు. స్వావలంబన ఒక కీలక మైలురాయి మాత్రమే.. ప్రపంచ స్థాయి పోటీతత్వమే తదుపరి లక్ష్యం అని ఆయన అన్నారు. నాణ్యత, ఉత్పాదకత, సాంకేతికత, ఖర్చు, సమయపాలన విషయంలో భారత షిప్‌యార్డులు ప్రపంచస్థాయిలో నిలవాలని పిలుపునిచ్చారు. హిందుస్థాన్ షిప్‌యార్డ్ దేశ సముద్ర సామర్థ్యానికి సంరక్షకంగా పనిచేస్తోందని పేర్కొంటూ, ఇకపై “మెరుగ్గా డిజైన్ చేయాలి.. వేగంగా నిర్మించాలి.. సమయానికి అందించాలి” అనే లక్ష్యంతో ముందుకు సాగాలని అన్నారు. భారత నౌకాదళం హిందూ మహాసముద్ర ప్రాంతంలో తొలి స్పందన దళంగా, విశ్వసనీయ భద్రతా భాగస్వామిగా వ్యవహరిస్తోందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. మానవతా సహాయం, విపత్తు నిర్వహణ, సముద్ర దోపిడీ నిరోధం, తరలింపు చర్యలు, సముద్ర భద్రతలో నౌకాదళం తన సామర్థ్యాన్ని చాటుతోందని వివరించారు.
#INSSurya #FleetSupportShip #FSS1 #RajnathSingh #Visakhapatnam #Vizag #HindustanShipyard #HSL #IndianNavy #FSS5 #Shipbuilding #MaritimeIndustrialHub #IndianMaritimePower #MakeInIndia #DefenceNews #AndhraPradesh











