Home Telangana ఈసీలో విభేదాలు? ముగ్గురు కమిషనర్ల కీలక భేటీ

ఈసీలో విభేదాలు? ముగ్గురు కమిషనర్ల కీలక భేటీ

ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాలపై వార్తలు చర్చనీయాంశమైన వేళ.. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, వివేక్‌ జోషి శనివారం న్యూఢిల్లీలోని నిర్వాచన్‌ సదన్‌లో సమావేశమయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగిన ఈ భేటీ అనంతరం ఈసీ ఎస్‌ఐఆర్‌ సహా కీలక నిర్ణయాలన్నీ ముగ్గురు కమిషనర్ల ఏకగ్రీవ ఆమోదంతోనే తీసుకున్నామని స్పష్టం చేసింది. ఫారం-6 మార్పులు, ఈసీనెట్‌ వ్యవస్థ, ఐటీ విభాగంలో బాధ్యతల మార్పు, పశ్చిమ బెంగాల్‌ ఎస్‌ఐఆర్‌ అప్పీళ్లు, గోవాలో ఓటర్ల జాబితా అంశాలపై కమిషనర్ల మధ్య విభేదాలున్నాయన్న వార్తల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఫారం-6 నుంచి ఈసీనెట్‌ వరకు

ఎస్‌ఐఆర్‌ సమయంలో కొత్త ఓటర్ల ఫారం-6తో జత చేసిన డిక్లరేషన్‌పై వచ్చిన అభ్యంతరాలపై ఈసీ వివరణ ఇచ్చింది. తల్లిదండ్రుల పేర్ల ఆధారంగా గత ఎస్‌ఐఆర్‌ జాబితాతో వివరాలను అనుసంధానించే విధానాన్ని సుప్రీంకోర్టు సమర్థించిందని తెలిపింది. ఈసీనెట్‌ పోర్టల్‌పై సమీక్ష కోసం సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఐఐటీ లేదా ఐఐఐటీకి చెందిన స్వతంత్ర నిపుణుడిని కూడా కమిటీలో చేర్చనున్నారు. గోవాలో జాబితా నుంచి మినహాయించబడిన 97 మంది ఓటర్లలో 81 మంది ఇప్పటికే ఫారం-6 దాఖలు చేసినట్లు ఈసీ తెలిపింది.

ఎస్‌ఐఆర్‌పై ఏకగ్రీవ నిర్ణయాలే

2025 జూన్‌ 24న ఎస్‌ఐఆర్‌ ప్రారంభానికి జారీ చేసిన ఉత్తర్వుతో పాటు తరువాతి షెడ్యూళ్లన్నీ ఏకగ్రీవ ఆమోదంతోనే జారీ అయ్యాయని ఈసీ మరోసారి స్పష్టం చేసింది. ఇకపై కమిషన్‌ సమావేశాల అజెండాలను ముందుగానే సభ్యులకు పంపాలని, సమావేశాల మినిట్స్‌ నమోదు చేయాలని నిర్ణయించింది. కమిషనర్లు అధికారులకు ఇచ్చే ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించింది. ఢిల్లీలో ఎస్‌ఐఆర్‌ క్లెయిమ్స్‌, అభ్యంతరాల గడువును అక్టోబర్‌ 30 వరకు పొడిగించగా, పరిష్కార గడువును నవంబర్‌ 30 వరకు పెంచింది. మహారాష్ట్రలోనూ గడువులను పొడిగించింది. దీంతో అంతర్గత చర్చలు వేరు, అధికారిక నిర్ణయాలు వేరు అని ఈసీ స్పష్టం చేసినా.. ఈ వ్యవహారంపై విపక్షాల ప్రశ్నలు మాత్రం కొనసాగుతున్నాయి.

 

#ElectionCommission #ECI #GyaneshKumar #SukhbirSinghSandhu #VivekJoshi #ECIRift #SIR #SpecialIntensiveRevision #Form6 #ECINet #VoterList #ElectionTransparency #GoaVoters #WestBengalSIR #ElectionNews