పంటకు గిట్టుబాటు ధర లేక రైతు నష్టపోయే పరిస్థితి వస్తే ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ధరల రక్షణ కల్పిస్తుందని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గత వైకాపా ప్రభుత్వంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేసినా రైతులకు ఆశించిన ప్రయోజనం దక్కలేదని విమర్శించారు. ఐదేళ్లలో రూ.2,140 కోట్లు కేటాయించినట్లు చూపించి.. వాస్తవంగా రూ.1,475 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం 2025-26లో పంటల ధరల రక్షణ కోసం రూ.800 కోట్ల వరకు ఖర్చు చేసిందని వెల్లడించారు. పొగాకుకు రూ.271 కోట్లు, మామిడికి రూ.261 కోట్లు, ఉల్లికి రూ.125 కోట్లు, కోకోకు రూ.14 కోట్లు, టమాటాకు రూ.12 కోట్ల సాయం అందించినట్లు వివరించారు. తోతాపురి మామిడి ధరలు పడిపోవడంతో కిలోకు రూ.4 చొప్పున ధర లోటు భర్తీ చేసి 7.03 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తికి రైతులకు ప్రయోజనం కల్పించామని చెప్పారు. ఆఫ్-స్టైల్, లో-గ్రేడ్ పొగాకు రైతులకు కిలోకు రూ.10 ప్రోత్సాహకం ఇచ్చామని తెలిపారు.
పౌల్ట్రీ రంగానికి రూ.657 కోట్ల ప్యాకేజీ
రాష్ట్ర పౌల్ట్రీ రంగానికి కొత్త ఊపిరి పోసేలా ‘ఏపీ పౌల్ట్రీ డెవలప్‌మెంట్ పాలసీ 2026-29’కు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని అచ్చెన్నాయుడు వెల్లడించారు. రంగం అభివృద్ధికి రూ.657 కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినట్లు తెలిపారు. ఉత్పత్తి వ్యయం తగ్గించడం, ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించడం, ఉపాధి అవకాశాలు పెంచడం పాలసీ ప్రధాన లక్ష్యాలని చెప్పారు. కోళ్ల ఫారాలు, హేచరీల రుణాలపై 4 శాతం వడ్డీ రాయితీ, లో-టెన్షన్ ఫారాలకు యూనిట్‌కు రూ.3.75, ఫీడ్ మిక్సింగ్ యూనిట్లకు రూ.4.75 టారిఫ్ సదుపాయం కల్పించినట్లు తెలిపారు. కొత్త ఎన్విరాన్‌మెంట్ కంట్రోల్డ్ షెడ్లకు రూ.25 లక్షల వరకు, పాత షెడ్ల ఆధునీకరణకు రూ.20 లక్షల వరకు 25 శాతం క్యాపిటల్ సబ్సిడీ అందిస్తామని చెప్పారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏటా 2,720 మదర్ పౌల్ట్రీ యూనిట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. విజయవాడ, విశాఖపట్నం, చిత్తూరులో పీపీపీ విధానంలో ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేయడంతో పాటు ఫీడ్ ఖర్చు తగ్గించేందుకు కేంద్రంతో చర్చించి నూక బియ్యం సరఫరా చేస్తామని మంత్రి వెల్లడించారు.
#Achchennaidu #APAgriculture #FarmerSupport #CropPriceProtection #APFarmers #AndhraPradeshFarmers #MarketIntervention #TobaccoFarmers #MangoFarmers #OnionFarmers #PoultryDevelopmentPolicy #APPoultryPolicy #PoultryPackage #657CrorePoultryPackage #PoultryFarms #PoultrySubsidy #PoultryIndustry #WomenPoultryUnits #APGovernment #AndhraPradesh #APNews











