సర్ సాకుతో కాంగ్రెస్ వైఫల్యాలు దాచలేరు!
2029లోనూ ఓటమి తప్పదన్న అమిత్ షా
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)పై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలతో రాజకీయ వేడి పెరిగింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ 2024 తర్వాతే ప్రారంభమైందని, రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ఎన్నికల్లో ఓడిపోతూనే ఉందని విమర్శించారు. గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎస్‌ఐఆర్‌ను సాకుగా చూపుతోందని ఆరోపించారు.
గాంధీనగర్‌లో బీజేపీ జోరు.. మోదీకి ప్రజాదరణ
గుజరాత్ రాజధాని గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 44 స్థానాలకు గాను బీజేపీ 38 స్థానాలను కైవసం చేసుకుని ఘన విజయం సాధించింది. థారా, ఓఖా మున్సిపాలిటీల్లోనూ అధికారాన్ని నిలబెట్టుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే గాంధీనగర్‌లో బీజేపీ ఓట్ల శాతం 10 శాతం పెరిగిందని అమిత్ షా పేర్కొన్నారు. గుజరాత్‌లో 41 ఏళ్లుగా కాంగ్రెస్ ఒక్క ఎన్నికలోనూ విజయం సాధించలేదని వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరిలో జరిగిన ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు ఒక్క సీటు దక్కలేదని గుర్తుచేశారు. ప్రజల మద్దతు బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోదీకి ఉందని పేర్కొంటూ, 2029 లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రతిపక్షాలకు మరోసారి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.
ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్ అభ్యంతరం
అమిత్ షా వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీ తప్పుబట్టారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ ఓటములకు ఎస్‌ఐఆర్‌పై తమ అభ్యంతరాలకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఓటర్ల జాబితాల సవరణను తాము వ్యతిరేకించడం లేదని, అయితే బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రత్యేక సవరణ చేపట్టడంపై సందేహాలున్నాయని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా నుంచి ఒక్కరి పేరు తొలగినా, ఆ ప్రభావం వారి కుటుంబంపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
#AmitShah #SIR #RahulGandhi #Congress #BJP #GyaneshKumar #VoterListRevision #GujaratElections #Gandhinagar #NarendraModi #AbhishekManuSinghvi #LokSabhaElections2029 #IndianPolitics #PoliticalNews











