కర్నూలు నగరానికి 91 ఆటోలు మంజూరు … ఉపయోగంలోకి 40 ఆటోలు.
9.5 ఎకరాల్లో రూ.8 కోట్లతో ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ .
రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్.
కర్నూలు: కర్నూలు నగరంలో కొత్తగా ఎలక్ట్రిక్ ఆటోలు అందుబాటులోకి రావడంతో ఇంటింటి చెత్తసేకరణ మరింత పటిష్టంగా జరుగుతోందని, ఇంటింటి చెత్తసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణలో 5.6 శాతం మెరుగుదల నమోదైందని రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. వెంకటరమణ కాలనీలో విశాల్ మార్ట్ వెనుక, జొహరాపురం రోడ్డులో ఉన్న జీటీఎస్ స్టేషన్లను మంగళవారం కమిషనర్ చల్లా ఓబులేసుతో కలిసి పట్టాభిరామ్ పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పర్యావరణహితంగా ఇంటింటి చెత్తసేకరణ చేపట్టడమే లక్ష్యంగా ఎలక్ట్రిక్ ఆటోలను తీసుకొచ్చామని, వాటి ఫలితంగా నగరాలు, పట్టణాల్లో ఇంటింటి చెత్తసేకరణ మెరుగుపడుతోందన్నారు. కర్నూలులో 5.6 శాతం మెరుగుదల నమోదవడం ఈ-ఆటోల పనితీరుకు నిదర్శనమన్నారు. 100 శాతం ఇంటింటి చెత్తసేకరణే లక్ష్యంగా నిర్ణీత మార్గాల్లో ఎలక్ట్రిక్ ఆటోలు తిరుగుతూ ప్రతిరోజూ ఇళ్ల వద్దకే చేరుకుని తడి, పొడి చెత్తను సేకరిస్తున్నాయన్నారు. ప్రతి రోజూ నగరంలో 225 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుందని, ఇవన్నీ డంప్‌యార్డుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, కమిషనర్ చల్లా ఓబులేసు ప్రత్యేక చొరవ తీసుకుని జీటీఎస్ స్టేషన్లను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కర్నూలు నగరానికి 91 ఆటోలు మంజూరు చేశామని, ఇప్పటికే 40 ఆటోలు వచ్చాయని, మిగిలినవి సైతం ఈ నెలాఖరులోగా వస్తాయన్నారు. నగరంలో ఉత్పత్తయ్యే చెత్తను ఎప్పటికప్పుడు రీసైక్లింగ్ చేసేందుకు గార్గేయపురం డంప్‌యార్డులో 9.5 ఎకరాల విస్తీర్ణంలో రూ.8 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామని, ఈ ప్లాంట్ ద్వారా ప్రతిరోజూ 200 మెట్రిక్ టన్నుల చెత్తను శాస్త్రీయంగా రీసైక్లింగ్ చేసి పునర్వినియోగానికి అనువుగా మారుస్తామన్నారు. పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. మరో ఏడాదిన్నరలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నిర్మాణం పూర్తవుతుందని, ఇలా 100 శాతం ఇంటింటి చెత్తసేకరణ నుంచి ఘన వ్యర్థాల నిర్వహణ వరకు రూ.కోట్ల రూపాయలు వెచ్చించి పూర్తిస్థాయి ప్రాజెక్టులను సమర్థవంతంగా చేపడుతున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పంతో ఇవన్నీ సాధ్యమవుతున్నాయన్నారు. రాబోయే మూడు నెలల్లో 100 శాతం ఇంటింటి చెత్తసేకరణ జరగబోతోందని, ప్రజలు సైతం తమ ఇళ్ల వద్దే హోం కంపోస్టింగ్ చేయాలని కోరారు.
అనంతరం జొహరాపురం డంప్‌యార్డులో బయోమైనింగ్ ప్రక్రియను చైర్మన్ పట్టాభిరామ్ పరిశీలించారు. జరుగుతున్న పనుల వివరాలను అధికారులు ఆయనకు వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాలను పట్టాభిరామ్ పరిశీలించి, ఒక వాహనాన్ని ఆయనే స్వయంగా నడిపారు. బయోమైనింగ్ పూర్తయిన స్థలాన్ని ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించుకునేలా స్థానిక ప్రజాప్రతినిధుల సూచనల ప్రకారం ప్రణాళికలు రూపొందించుకోవాలని, మిగిలిన 1.18 లక్షల మెట్రిక్ టన్నుల బయోమైనింగ్‌ను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్ఈ రమణమూర్తి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం. రఘు, పబ్లిక్ హెల్త్ ఎంఈ గుర్రప్ప యాదవ్, నగరపాలక సంస్థ ఎంఈ గిరిరాజ్, డీఈఈ పవన్ కుమార్ రెడ్డి, ఏఈ వైష్ణవి తదితరులు పాల్గొన్నారు.
#Kurnool #ElectricAutos #GarbageCollection #WasteManagement #SolidWasteManagement #KurnoolMunicipalCorporation #ElectricVehicles #RecyclingPlant #WasteToEnergy #BioMining #SwachhaAndhra #KurnoolDevelopment #CleanKurnool #AndhraPradesh #GreenMobility











