విస్తరణపై అదే సస్పెన్స్.
సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గం గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సమావేశం కానుంది. ఇది రేవంత్ సర్కార్ 37వ కేబినెట్ భేటీ. ఆరు గ్యారెంటీల అమలు, ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అర్హులైన పేదలకు త్వరగా ఇళ్లు అందేలా మార్గదర్శకాలు ఖరారు చేసే ఛాన్స్ ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ మార్గాలు, రైతుల సాయం, పెండింగ్ బకాయిలపైనా చర్చ జరగనుంది. పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడంపై కేశవరావు కమిటీ నివేదికను పరిశీలించే అవకాశం ఉంది. నిషేధిత భూముల జాబితా, చేయూత పెన్షన్లు, రాజీవ్ యువ వికాసం, హైదరాబాద్ మెట్రో, మూసీ ప్రాజెక్టు, ఆర్ఆర్ఆర్, ఇందిరమ్మ చీరల పంపిణీ వంటి అంశాలు కూడా ఎజెండాలో ఉండనున్నాయి.
కేబినెట్ విస్తరణకు మరింత జాప్యం?
కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ, సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ, అంచనాల సవరణపైనా మంత్రులు చర్చించనున్నారు. ఇదే సమయంలో మూడు ఖాళీ మంత్రి పదవుల భర్తీపై మాత్రం స్పష్టత లేకపోవడం ఆసక్తికరంగా మారింది. కేబినెట్లో మొదటి నుంచి రెండు స్థానాలు ఖాళీగా ఉండగా, ఇటీవల కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించడంతో ఖాళీల సంఖ్య మూడుకు చేరింది. విస్తరణపై చాలాకాలంగా ప్రచారం జరుగుతున్నా, ఈ ఏడాది చివరి వరకు నిర్ణయం తీసుకునే అవకాశం లేదని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వరకు జాప్యం జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. రాబోయే విస్తరణను ఎన్నికల టీంగా మంత్రివర్గాన్ని తీర్చిదిద్దేలా చేపట్టాలనే ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్, సీఎం రేవంత్రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.
#TelanganaCabinet #RevanthReddy #TelanganaGovernment #CabinetMeeting #IndirammaHouses #SixGuarantees #Kaleshwaram #IrrigationProjects #HyderabadMetro #MusiProject #RRR #KondaSurekha #CabinetExpansion #TelanganaCongress #TelanganaPolitics











