అదనపు డిక్లరేషన్‌కు ఇక చెక్.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)పై వివాదం కొనసాగుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఫామ్-6కు జత చేసిన అదనపు డిక్లరేషన్‌ను తొలగించింది. కొత్తగా ఓటరుగా నమోదు కావాలనుకునే వారు ఇక సాధారణ ఫామ్-6లో అవసరమైన వివరాలు మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషితో కూడిన పూర్తి కమిషన్ సెప్టెంబర్ 26న తీసుకుంది.
ఎస్‌ఐఆర్ జరుగుతున్న చోట మాత్రం
ఎస్‌ఐఆర్ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రం అదనపు డిక్లరేషన్ కొనసాగుతుంది. కొత్తగా ఓటరుగా నమోదు అయ్యే వ్యక్తి లేదా వారి తల్లిదండ్రులు, తాతయ్యలు, అమ్మమ్మలు గత ప్రత్యేక సవరణలోని ఓటర్ల జాబితాలో ఉన్నారా అనే వివరాలు ఇందులో ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగానే ఈ అదనపు ప్రకటనను ఈసీ తీసుకొచ్చింది. అయితే సవరణ పూర్తయిన ప్రాంతాల్లో ఇక దాని అవసరం లేదని కమిషన్ స్పష్టం చేసింది. దీంతో ఆయా ప్రాంతాల్లో కొత్త ఓటర్ల నమోదుకు సాధారణ నిబంధనల ప్రకారం ఫామ్-6 మాత్రమే ఉపయోగించనున్నారు.
ఆన్‌లైన్ వ్యవస్థలోనూ మార్పులు
ఎస్‌ఐఆర్ పూర్తయిన ప్రాంతాల్లో ఫామ్-6కు సంబంధించిన అదనపు డిక్లరేషన్‌ను ఈసీఐనెట్ యాప్, పోర్టల్ నుంచి తొలగించారు. సంబంధిత రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారుల వెబ్‌సైట్లలోనూ మార్పులు చేశారు. ఇక ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకునే పౌరులు రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్–1960 ప్రకారం నిర్దేశించిన సాధారణ ఫామ్-6లో వివరాలు సమర్పించాలి. ఎస్‌ఐఆర్ అమలు లేని సమయంలో సాధారణ చట్టబద్ధ ఫారాలనే ఉపయోగిస్తామని ఈసీ స్పష్టం చేసింది. దీంతో ఎస్‌ఐఆర్ పూర్తయిన ప్రాంతాల్లో పాత సాధారణ ఫామ్-6 విధానానికి ఆన్‌లైన్ ప్రక్రియ తిరిగి వచ్చింది.
ఫామ్-6 మార్పులపై ముందే అభ్యంతరాలు
ఫామ్-6లో మార్పులు చేయడంపై ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్–1960లో నిర్దేశించిన ఫారాన్ని నిబంధనలు మార్చకుండా మార్చడం సాధ్యమా అనే అంశంపై అభ్యంతరాలు వ్యక్తమైనట్లు సమాచారం. ముఖ్యంగా ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన అదనపు డిక్లరేషన్‌ను ఫామ్-6 దరఖాస్తు ప్రక్రియకు జత చేయడంపైనా ప్రశ్నలు తలెత్తాయి. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఎస్‌ఐఆర్ పూర్తయిన ప్రాంతాల్లో కొత్త ఓటర్ల నమోదుకు అదనపు ప్రకటన అవసరం లేకుండా సాధారణ చట్టబద్ధ ప్రక్రియకు ఈసీ మార్గం సుగమం చేసింది.
#ElectionCommission #ECI #Form6 #Form6Changes #SIR #SpecialIntensiveRevision #VoterRegistration #VoterList #ElectoralRoll #GyaneshKumar #SukhbirSinghSandhu #VivekJoshi #ECINET #VoterRegistrationIndia #ElectionNews











