భూముల ఆరోపణలపై శ్వేతపత్రం ఇవ్వాలి.
ముఖ్యమంత్రి రేవంత్‌కు బహిరంగ లేఖ.
సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్ల పర్యటనకు ముందు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. లేఖలో అనేక ప్రశ్నలు సంధించారు. సిరిసిల్లలో 8 వేల ఎకరాల ప్రభుత్వ భూమి పోయిందని, 2,400 ఎకరాలు తిరిగి స్వాధీనం చేసుకున్నామని సీఎం చేసిన వ్యాఖ్యలపై పూర్తి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏ మండలం, ఏ గ్రామం, సర్వే నంబర్లు, భూమి విస్తీర్ణం, బాధ్యుల వివరాలు ప్రజలకు వెల్లడించాలని కోరారు. ఆరోపణలు నిజమైతే ఆధారాలతో చూపించాలని, నిరూపించలేకపోతే సీఎం సిరిసిల్ల ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ అన్నారు.
నేతన్నలకు ఆర్డర్లు.. బకాయిలు చెల్లించాలి
సిరిసిల్ల నేతన్నలకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో బతుకమ్మ చీరలు, స్కూల్ యూనిఫాంలు, కేసీఆర్ కిట్లు, రంజాన్, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్‌ల ద్వారా నిరంతర ఉపాధి కల్పించామని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆర్డర్లను నిలిపివేయడంతో ఉపాధి అవకాశాలు తగ్గాయని ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న రూ.60 కోట్ల బకాయిలు చెల్లించి, 10 శాతం నూలు సబ్సిడీ, రూ.5 లక్షల నేతన్న బీమాను పునరుద్ధరించాలని కోరారు. అప్పారెల్ పార్క్, 88 ఎకరాల వీవింగ్ పార్క్‌ను పూర్తిస్థాయిలో ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
రైతులు.. విద్యార్థుల సమస్యలపై గడువులు
రైతు భరోసా బకాయిల చెల్లింపు, ఎకరాకు రూ.15 వేల సాయం, రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేయడం, రైతు బీమా పునరుద్ధరణకు స్పష్టమైన గడువులు ప్రకటించాలని కేటీఆర్ కోరారు. మల్కపేట నుంచి అప్పర్ మానేరు వరకు సాగునీటి పనులు పూర్తి చేయాలని అన్నారు. జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కాలేజీకి నిధులు, మన ఊరు–మన బడి బకాయిల చెల్లింపు, కొత్త పరిశ్రమలు, ఆక్వా హబ్, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.
హామీలన్నింటికీ తేదీలు ప్రకటించాలి
మహిళలకు నెలకు రూ.2,500 సాయం, పెరిగిన పెన్షన్లు, కల్యాణలక్ష్మి తులం బంగారం, ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యార్థులకు స్కూటర్లు, ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేల సాయం వంటి హామీలను అమలు చేయాలని కేటీఆర్ కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం సిరిసిల్లలో చేపట్టిన అభివృద్ధి పనులు, ఖర్చులు, పెండింగ్ పనులు, కొత్త ప్రాజెక్టులపై మరో శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. సీఎం పర్యటనలో రాజకీయ విమర్శలకంటే ప్రజల సమస్యలకు సమాధానాలు, హామీల అమలుకు నిర్దిష్ట తేదీలు ప్రకటించాలని కేటీఆర్ కోరారు.
#KTR #RevanthReddy #Sirisilla #SirisillaTour #BRS #TelanganaPolitics #WhitePaper #GovernmentLand #LandAllegations #SirisillaWeavers #TextileIndustry #RythuBharosa #FarmersIssues #JNTU #CongressGovernment











