Home Inter National News బాలయ్య సినిమాతో ఇరాన్‌ కౌంటర్‌

బాలయ్య సినిమాతో ఇరాన్‌ కౌంటర్‌

భగవంత్‌ కేసరి క్లిప్‌తో ట్రంప్‌‌పై సెటైర్‌.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను టార్గెట్‌ చేస్తూ ఇరాన్‌ వినూత్నంగా స్పందించింది. జింబాబ్వేలోని ఇరాన్‌ రాయబార కార్యాలయం నందమూరి బాలకృష్ణ నటించిన తెలుగు చిత్రం ‘భగవంత్‌ కేసరి’లోని 58 సెకన్ల యాక్షన్‌ సీన్‌ను షేర్‌ చేస్తూ ట్రంప్‌పై సెటైర్‌ వేసింది. తుపాకులు, రక్షణ కవచాలతో రెండు వర్గాలు ఎదురెదురుగా నిలిచే సన్నివేశాన్ని పోస్టు చేస్తూ.. ఇరాన్‌ను అంతం చేస్తానని ట్రంప్‌ మాట్లాడుతున్నా, తమ దేశం రక్షణ లేనిది కాదని పేర్కొంది. అమెరికా పాలకులు హాలీవుడ్‌కు బదులుగా ఇటీవల ‘బాలీవుడ్‌’ సినిమాలు చూస్తున్నారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది.

యూఎన్‌ వేదికగా ట్రంప్‌ హెచ్చరిక

ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో ట్రంప్‌ ఇరాన్‌కు గట్టి హెచ్చరిక చేశారు. ఒప్పందం కుదిరితే ఇరాన్‌ పునర్నిర్మాణానికి అవకాశం ఉంటుందని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని చెప్పారు. ఒప్పందం లేకపోతే ఇరాన్‌ను ‘అంతం’ చేసే పరిస్థితి రావచ్చని వ్యాఖ్యానించారు. దాదాపు ఏడు నెలలుగా కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రావడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది.

బెదిరింపుల మధ్య చర్చల బాట

ఓవైపు మాటల యుద్ధం కొనసాగుతుండగానే మరోవైపు అమెరికా-ఇరాన్‌ మధ్య దౌత్య ప్రయత్నాలు సాగుతున్నాయి. న్యూయార్క్‌లో యూఎన్‌ సమావేశాల సందర్భంగా అమెరికా ప్రతినిధులు స్టీవ్‌ విట్కాఫ్‌, జారెడ్‌ కుష్నర్‌ ఇరాన్‌ ప్రతినిధులతో సుమారు మూడు గంటలపాటు చర్చలు జరిపినట్లు ట్రంప్‌ వెల్లడించారు. సమావేశం సానుకూలంగా సాగిందని పేర్కొన్నారు. పోర్టులపై ఆంక్షల తొలగింపు, స్తంభింపజేసిన ఆస్తుల విడుదల వంటి అంశాలను ఇరాన్‌ ప్రస్తావిస్తోంది. దీంతో ఒకవైపు బెదిరింపులు.. మరోవైపు చర్చలతో అమెరికా-ఇరాన్‌ వ్యవహారం ఆసక్తికర మలుపు తిరిగింది.

#Iran #DonaldTrump #BhagavanthKesari #NandamuriBalakrishna #Balakrishna #IranEmbassy #TrumpIran #USIran #UNGA2026 #Tollywood #TeluguCinema #SteveWitkoff #JaredKushner #IranNews #WorldNews