Home Inter National News పాక్‌ ప్రావిన్సుల విభజనపై భగ్గు భగ్గు

పాక్‌ ప్రావిన్సుల విభజనపై భగ్గు భగ్గు

మునీర్‌ ప్రతిపాదనపై కరాచీలో భారీ నిరసన
సింద్ సరిహద్దులు మార్చొద్దంటూ ఆందోళన

పాకిస్థాన్‌లోని నాలుగు ప్రధాన ప్రావిన్సులను విభజించి కొత్త పరిపాలనా ప్రాంతాలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. సైన్యాధిపతి ఫీల్డ్‌ మార్షల్‌ అసిమ్‌ మునీర్‌కు ఈ ఆలోచనను ఆపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో సింధ్‌ ప్రావిన్స్‌ విభజనను వ్యతిరేకిస్తూ కరాచీలో వేలాది మంది వీధుల్లోకి వచ్చారు. జేయ్‌ సింధ్‌ రహ్బర్‌ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో జాతీయవాద నేతలు, రాజకీయ కార్యకర్తలు, న్యాయవాదులు, పౌరసమాజ ప్రతినిధులు పాల్గొన్నారు. సంప్రదాయ అజ్రక్‌ కండువాలు, టోపీలు ధరించి నిరసనకారులు తమ నిరసనను వ్యక్తం చేశారు. సింధ్‌ భౌగోళిక స్వరూపాన్ని మార్చే హక్కు ఎవరికీ లేదని, ఏ నిర్ణయమైనా ప్రజల అంగీకారంతోనే జరగాలని నేతలు స్పష్టం చేశారు. సింధ్‌ చరిత్ర, సంస్కృతి, నాగరికతతో ముడిపడిన ప్రత్యేక గుర్తింపును కేవలం పరిపాలనా సౌలభ్యం పేరుతో మార్చలేరని హెచ్చరించారు. కొత్త ప్రావిన్సుల ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలనే ఆలోచనను కూడా వారు వ్యతిరేకించారు.

మునీర్‌ ప్రతిపాదనతో రాజకీయ కలకలం

పంజాబ్‌, సింధ్‌, ఖైబర్‌ పఖ్తూన్‌ఖ్వా, బలూచిస్థాన్‌ ప్రావిన్సులను విభజించి డజనుకు పైగా ప్రాంతాలుగా మార్చాలన్నది ఈ ప్రతిపాదనలోని ప్రధాన అంశంగా ప్రచారంలో ఉంది. పాలనను ప్రజలకు చేరువ చేయడం, అధికార వికేంద్రీకరణ, పరిపాలనా సామర్థ్యం పెంచడం దీని లక్ష్యాలుగా చెబుతున్నారు. అయితే దీనివల్ల పాకిస్థాన్‌ సమాఖ్య వ్యవస్థ స్వరూపమే మారిపోయే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మునీర్‌ పేరుతో ఎలాంటి అధికారిక ప్రణాళిక ఇప్పటివరకు వెలువడలేదు. అయినప్పటికీ, సైన్యాధిపతి అధికారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు రాజకీయ ప్రత్యర్థులను బలహీనపరిచే ప్రయత్నంగా ఈ ప్రతిపాదనను ది ఎకనామిస్ట్‌ అక్టోబర్‌ 8 సంపాదకీయం అభివర్ణించింది. ప్రజల సమ్మతి లేకుండా మార్పులు రుద్దితే రాజ్యాంగబద్ధంగా, న్యాయపరంగా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాడతామని సింధ్‌ నేతలు హెచ్చరించారు. ప్రావిన్స్‌ అంతటా ఉద్యమాలు చేపడతామని ప్రకటించారు.

బిలావల్‌ హెచ్చరికతో మరింత ఉద్రిక్తత

సింధ్‌ విభజనపై పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ చైర్మన్‌ బిలావల్‌ భుట్టో జర్దారీ కూడా తీవ్రంగా స్పందించారు. నవంబర్‌ 17న కరాచీ ప్రెస్‌ క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, బలవంతంగా ప్రావిన్స్‌ను విభజిస్తే ప్రజలు ఆయుధాలు చేపట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. సమాజంలో శత్రుత్వం పెరిగి రక్తపాతం జరిగే ప్రమాదం ఉందన్నారు. కొత్త ప్రావిన్సుల ఏర్పాటుకు తమ పార్టీ వ్యతిరేకం కాదని, అయితే అది ప్రజల కోరిక, రాజ్యాంగం, చట్టం ప్రకారమే జరగాలని స్పష్టం చేశారు. బలవంతపు విభజనను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. కొత్త ప్రావిన్సుల ఏర్పాటుకు రాజ్యాంగంలోనే నిర్దిష్ట విధానం ఉందని, ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో రాజ్యాంగ విరుద్ధ మార్గాలను అనుసరించకూడదని వ్యాఖ్యానించారు. షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం, సంబంధిత సంస్థలు ఉద్రిక్తతలు పెంచే నిర్ణయాలకు దూరంగా ఉండాలని నిరసనకారులు డిమాండ్‌ చేస్తున్నారు. సింధ్‌ అస్తిత్వం, ప్రజల హక్కులే తమ పోరాటమని ప్రకటించడంతో పాకిస్థాన్‌లో ప్రావిన్సుల పునర్విభజన అంశం మరింత రాజకీయ వేడిని పెంచుతోంది.

 

#PakistanPolitics #Sindh #KarachiProtests #AsimMunir #SindhProvince #BilawalBhutto #PakistanArmy #PakistanProtests #ShehbazSharif