పాక్ అంతరిక్ష యాత్రకు డ్రాగన్ భరోసా.
మానవ అంతరిక్ష యాత్రకు వ్యోమగామి.
పాకిస్థాన్ తన తొలి వ్యోమగామిని చైనా అంతరిక్ష నౌకలో పంపేందుకు సిద్ధమవుతున్న వేళ ప్రపంచ దృష్టి లాంగ్ మార్చ్–2ఎఫ్ రాకెట్‌పై పడింది. చైనా మానవ అంతరిక్ష యాత్రలకు ఉపయోగిస్తున్న ఏకైక రాకెట్ ఇదే. 1990ల ప్రారంభంలో సొంతంగా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపాలన్న లక్ష్యంతో చైనా ఈ రాకెట్ అభివృద్ధి ప్రారంభించింది. చైనా అకాడమీ ఆఫ్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ రూపొందించిన ఈ వాహక నౌకను 1999లో తొలిసారి ప్రయోగించారు. అప్పటి నుంచి 29 ప్రయోగాలు వరుసగా విజయవంతమయ్యాయి. సుమారు 58.3 మీటర్ల ఎత్తు, 497 టన్నుల బరువున్న ఈ రాకెట్‌కు నాలుగు ఇంధన బూస్టర్లు అదనపు శక్తినిస్తాయి. తక్కువ భూమి కక్ష్యలోకి ఎనిమిది టన్నులకు పైగా బరువును తీసుకెళ్లగల సామర్థ్యం దీని సొంతం. వ్యోమగాముల భద్రత కోసం అత్యవసర పరిస్థితుల్లో క్యాప్సూల్‌ను రాకెట్ నుంచి వేరు చేసే ఎస్కేప్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు.
యాంగ్ లీవే నుంచి టియాంగాంగ్ వరకు
చైనా మానవ అంతరిక్ష ప్రయాణ చరిత్ర 2003 అక్టోబర్ 15న ప్రారంభమైంది. లాంగ్ మార్చ్–2ఎఫ్ రాకెట్‌పై షెన్‌జౌ–5 నౌకలో ప్రయాణించిన యాంగ్ లీవే చైనా తొలి వ్యోమగామిగా చరిత్ర సృష్టించారు. దాదాపు 21 గంటలు అంతరిక్షంలో గడిపి సురక్షితంగా భూమికి చేరుకున్నారు. దీంతో సొంత సాంకేతికతతో మనిషిని అంతరిక్షంలోకి పంపిన మూడో దేశంగా చైనా నిలిచింది. అప్పటి నుంచి చైనా వ్యోమగాముల ప్రతి మానవ అంతరిక్ష యాత్రకు ఈ రాకెట్టే వేదికైంది. అంతరిక్ష ప్రయోగశాలల నుంచి టియాంగాంగ్ స్పేస్ స్టేషన్ వరకు వ్యోమగాములను చేరవేసింది. అంతరిక్ష నడకలు, శాస్త్రీయ పరిశోధనలు, నిరంతర అంతరిక్ష నివాస కార్యక్రమాలకు తోడ్పడింది. 2026 నాటికి 30 మంది చైనా వ్యోమగాములు ఈ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లారు. చైనా వాయవ్య ప్రాంతంలోని గోబీ ఎడారిలో ఉన్న జియుక్వాన్ కేంద్రం నుంచి వీటిని ప్రయోగిస్తున్నారు. 1958లో ఏర్పాటైన ఈ కేంద్రం చైనాలోనే అత్యంత పురాతన అంతరిక్ష ప్రయోగ కేంద్రం.
పాక్ యాత్రతో పెరుగుతున్న చైనా ప్రభావం
చైనా అంతరిక్ష కేంద్రంలో అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో భాగంగా పాకిస్థాన్‌కు కూడా అవకాశం కల్పిస్తోంది. ప్రతిపాదిత యాత్రలో పాకిస్థానీ వ్యోమగామి ముహమ్మద్ జీషాన్ అలీ, చైనా వ్యోమగాములు టాంగ్ హోంగ్‌బో, వూ యీతో కలిసి ప్రయాణించనున్నారు. ఈ యాత్ర పాకిస్థాన్‌కు చారిత్రక ఘట్టం మాత్రమే కాదు.. అంతరిక్ష రంగంలో చైనా తన భాగస్వామ్యాన్ని విస్తరిస్తోందనే సంకేతం కూడా. ఇదే సమయంలో భారత్–చైనా అంతరిక్ష ప్రగతిపై పోలికలు మొదలయ్యాయి. 2003లోనే చైనా తొలి వ్యోమగామిని పంపగా, ప్రస్తుతం సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్వహిస్తోంది. భారత్ మాత్రం గగన్‌యాన్ కార్యక్రమం ద్వారా తొలి స్వదేశీ మానవ అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతోంది. ఇస్రో కీలక పరీక్షలు నిర్వహించినప్పటికీ భారత వ్యోమగామి ఇంకా స్వదేశీ రాకెట్‌పై అంతరిక్షంలోకి వెళ్లలేదు. రెండు దశాబ్దాలకు పైగా ముందంజలో ఉన్న చైనా, లాంగ్ మార్చ్–2ఎఫ్ విజయాలతో తన సాంకేతిక సామర్థ్యాన్ని చాటుతోంది. పాక్ యాత్ర ఈ ఆధిపత్యాన్ని మరింత బలపరిచే అవకాశముంది.
#LongMarch2F #ChinaSpaceProgram #PakistanAstronaut #HumanSpaceflight #YangLiwei #TiangongSpaceStation #Shenzhou #PakistanChina #Gaganyaan #ISRO











