సబ్‌స్టేషన్‌లో కేటీఆర్ తనిఖీలు.
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడం సబ్‌స్టేషన్ వద్ద రైతుల విద్యుత్ సమస్య మరోసారి తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతులతో కలిసి సబ్‌స్టేషన్‌కు చేరుకుని కరెంట్ సరఫరాపై ఆరా తీశారు. సబ్‌స్టేషన్ లాగ్‌బుక్‌ను పరిశీలించి, విద్యుత్ సరఫరా వేళలపై అధికారులను ప్రశ్నించారు. కనీసం ఆరు గంటల కరెంట్ కూడా సక్రమంగా అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ కోతల కారణంగా బోర్లు నడపలేక పంటలకు నీరు అందడం లేదని వాపోయారు. జూరాల ఆయకట్టు పరిధిలో సాగు పరిస్థితులపై రైతులు ఆందోళన వ్యక్తం చేయడంతో కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
24 గంటల కరెంట్ ఎక్కడ?
రైతుల సమస్యలపై స్పందించిన కేటీఆర్ 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న మాటలకు క్షేత్రస్థాయి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని విమర్శించారు. కనీసం 6 గంటల కరెంట్ కూడా సక్రమంగా ఇవ్వలేకపోతున్నారని రైతులు చెబుతున్నారని అన్నారు. సాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించి, వ్యవసాయానికి అవసరమైన విద్యుత్‌ను నిరంతరంగా అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జూరాల ఆయకట్టు పరిధిలో ఒక్క ఎకరం పంట ఎండిపోయినా ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రైతుల సమస్యలను పరిష్కరించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
పాలమూరు రైతులపై పోరాటం
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను త్వరగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. కరెంట్, సాగునీరు రెండింటి సమస్యలతో పాలమూరు రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి రాకముందే విద్యుత్ సరఫరాను గతంలో ఉన్న విధంగా సరిచేయాలని డిమాండ్ చేశారు.











