Home AP తిరుమలలో ఉచిత ఈవీ బస్సులు

తిరుమలలో ఉచిత ఈవీ బస్సులు

బ్రహ్మోత్సవాలకు కొత్త రవాణా సౌకర్యం.

తిరుమలలో పర్యావరణ పరిరక్షణతో పాటు భక్తులకు సౌకర్యవంతమైన రవాణా కల్పించే లక్ష్యంతో ఉచిత ఎలక్ట్రిక్ బస్సుల సేవలు బుధవారం ప్రారంభమయ్యాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ బస్సులను ప్రారంభించారు. పర్యావరణహిత రవాణా కోసం రిలయన్స్ సంస్థ 25 ఈవీ బస్సులు, భారత్ బయోటెక్ 7 బస్సులను టీటీడీకి ఉచితంగా అందించాయి. దీంతో మొత్తం 32 ఎలక్ట్రిక్ బస్సులు భక్తుల సేవలకు అందుబాటులోకి వచ్చాయి. బస్సుల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాల్లో భాగంగా జియో-బీపీ సహకారంతో ప్రత్యేక ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్‌ను రిలయన్స్ ఏర్పాటు చేసింది.

లక్షలాది భక్తులకు ప్రయోజనం

తిరుమలలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈవీ బస్సుల ఏర్పాటుకు రిలయన్స్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. గత జూన్‌లో శ్రీవారిని దర్శించుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సులను టీటీడీకి విరాళంగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు బస్సులు తిరుమల చేరుకుని భక్తుల సేవలకు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో తరలివచ్చే లక్షలాది మంది భక్తులు మాడ వీధులు, కాటేజీలు, దర్శన క్యూలైన్ల వద్దకు ఉచితంగా చేరుకునేందుకు ఈ బస్సులు ఉపయోగపడనున్నాయి. పర్యావరణహిత రవాణాతో పాటు భక్తుల ప్రయాణ భారాన్ని తగ్గించేలా ఈ సేవలు కీలకంగా మారనున్నాయి.

 

#Tirumala #EVBuses #ElectricBuses #FreeBusService #TirumalaBrahmotsavams #Brahmotsavams2026 #TTD #Tirupati #ChandrababuNaidu #Reliance #BharatBiotech #GreenTransport #EcoFriendlyTransport #PilgrimServices