Home AP ఏపీ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయం!

ఏపీ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయం!

అమరావతికి ఓకే.. సీఎం అభ్యర్థిని కాదు.

అమరావతిని ఏపీ రాజధానిగా అంగీకరించడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అమరావతినే రాజధానిగా అంగీకరించి తీరాల్సిందే అన్నారు. త్వరలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించిన ఆయన.. పార్టీ జెండా, అజెండా ప్రకటించే ముందు రాష్ట్ర సమస్యలను ప్రజల ముందుంచుతానని తెలిపారు. తాను సీఎం అభ్యర్థిని కాదని, బాల్‌ఠాక్రే తరహాలో మెంటర్‌గా మాత్రమే పార్టీకి దిశానిర్దేశం చేస్తానని స్పష్టం చేశారు. తన కుటుంబ సభ్యులకు పార్టీ పదవులు ఉండవని తేల్చిచెప్పారు.

66 శాతం యువతకు ప్రాధాన్యం

ఏపీని అప్పుల ఊబి నుంచి బయటకు తీసుకురావడంతో పాటు పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి బాట పట్టించడమే కొత్త పార్టీ లక్ష్యమని విజయసాయిరెడ్డి చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో రూ.1.02 లక్షల కోట్లుగా ఉన్న అప్పులు రూ.12 లక్షల కోట్లకు ఎలా చేరాయి? ఆ డబ్బు ఎక్కడికి వెళ్లింది? అని ప్రశ్నించారు. నిత్యావసర ధరలు, విద్యుత్‌ ఛార్జీలు, ఇంటి అద్దెలను నియంత్రించడంపై ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు. కేవలం రెడ్డి, కమ్మ వర్గాలకే సీఎం పదవులు పరిమితం కావాలా అని ప్రశ్నించిన ఆయన.. బీసీలతో పాటు అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తామని, పార్టీలో 66 శాతం ప్రాధాన్యం యువతకే ఇస్తామని ప్రకటించారు.

టీడీపీ, వైసీపీపై ఘాటు విమర్శలు

రాష్ట్రంలో ప్రస్తుతం మూడో రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమని విజయసాయిరెడ్డి అన్నారు. టీడీపీ, వైసీపీలు ఫ్యాక్షన్‌ కుటుంబ రాజకీయ పార్టీలుగా మారాయని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారం కంటే అధికార, సంపదపై ఆధిపత్యం కోసం రెండు పార్టీలు పోటీ పడుతున్నాయని విమర్శించారు. జనసేనపై కూడా ప్రజా సమస్యలపై స్పందించే పరిస్థితి లేదని అన్నారు. పోలీసు వ్యవస్థ సైతం రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. “ప్రజలకు గోరంత.. తమకు కొండంత” అన్న చందంగా పాలన సాగుతోందని వ్యాఖ్యానించారు. ఆరు కోట్ల మంది ప్రజల ప్రయోజనాలను కేంద్రంగా చేసుకుని కొత్త రాజకీయ శక్తిని నిర్మించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రానికి బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను అందించడమే తన లక్ష్యమని విజయసాయిరెడ్డి తెలిపారు.

 

#VijaySaiReddy #VijaySaiReddyParty #APPolitics #ThirdPoliticalAlternative #AndhraPradesh #Amaravati #AmaravatiCapital #NewPoliticalParty #APPoliticalAlternative #TDP #YSRCP #JanaSena #YouthPolitics #YouthLeadership #BCPolitics #APDevelopment #APDebtCrisis #AndhraPradeshPolitics #VijaySaiReddyNews #APNews