Home AP గుంటూరు మిర్చికి శ్రీలంక షాక్!

గుంటూరు మిర్చికి శ్రీలంక షాక్!


నాణ్యత లోపాలతో కంటైనర్ల తిరస్కరణ.
అఫ్లోటాక్సిన్.. అధిక తేమతో రిజెక్ట్.

గుంటూరు మిర్చికి శ్రీలంక నుంచి భారీ షాక్‌ తగిలింది. అఫ్లోటాక్సిన్‌ స్థాయిలు, అధిక తేమ శాతం ఉన్నట్టు గుర్తించిన శ్రీలంక అధికారులు పదుల సంఖ్యలో మిర్చి కంటైనర్లను తిరస్కరించారు. తేమ ఎక్కువగా ఉండటంతో మిర్చిలో ఫంగస్‌ ఏర్పడినట్టు అధికారులు గుర్తించారు. దీంతో మిర్చి నాణ్యత దెబ్బతిన్నట్టు నిర్ధారించారు. నాణ్యత ప్రమాణాలను కఠినంగా అమలు చేస్తున్న శ్రీలంక.. దిగుమతుల విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదు. నిబంధనలకు అనుగుణంగా లేని మిర్చి కంటైనర్లను వెనక్కి తీసుకెళ్లాలని ఎగుమతి వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. ఈ పరిణామంతో గుంటూరు మిర్చి ఎగుమతిదారుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే ఎగుమతి చేసిన సరుకును వెనక్కి తీసుకెళ్లాల్సి వస్తే ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

ఎగుమతిదారులతో శ్రీలంక చర్చలు

శ్రీలంక అధికారులు తీసుకున్న నిర్ణయంపై గుంటూరు మిర్చి ఎక్స్‌పోర్టర్లు చర్చలు ప్రారంభించారు. తిరస్కరించిన కంటైనర్ల విషయంలో పరిష్కారం కనుగొనేందుకు శ్రీలంక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. నాణ్యత పరీక్షలు, అఫ్లోటాక్సిన్‌ స్థాయిలు, తేమ శాతం వంటి అంశాలపై వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే గుంటూరు మిర్చికి విదేశీ మార్కెట్లలో నాణ్యత సమస్యలు ఎదురవడం ఇదే మొదటిసారి కాదు. రెండు నెలల క్రితం గుంటూరు నుంచి చైనాకు ఎగుమతి చేసిన మూడు కంటైనర్ల మిర్చిని అక్కడి అధికారులు తిరస్కరించారు. తాజాగా శ్రీలంక కూడా నిబంధనలను కఠినంగా అమలు చేస్తుండటంతో ఎగుమతిదారులు మరింత అప్రమత్తమయ్యారు. మిర్చి కోత, ఎండబెట్టడం, నిల్వ, ప్యాకింగ్‌ దశల్లో తేమ నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. విదేశీ మార్కెట్లలో గుంటూరు మిర్చి ప్రతిష్ఠను కాపాడేందుకు నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాల్సిన పరిస్థితి నెలకొంది.

 

#GunturChilli #GunturChilliExports #SriLanka #ChilliExports #ChilliExporters #Aflatoxin #ChilliQuality #FoodSafety #ExportRejection #AndhraPradesh #Guntur #AgricultureNews #SpiceExports #SriLankaImports #ExportNews