ఒక్క ప్రెస్‌మీట్‌తో సంబంధాలు దెబ్బతింటాయా?
భారత్‌లో ప్రవాస జీవితం గడుపుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తన రాజకీయ కార్యకలాపాలపై వస్తున్న విమర్శలకు ఘాటుగా స్పందించారు. భారత్‌లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం, అవామీ లీగ్ నేతలు, పార్టీ కార్యకర్తలను కలవడం వల్ల భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు ఎలా దెబ్బతింటాయని ప్రశ్నించారు. “నేను అంత శక్తివంతురాలిని కాదు.. నా ఒక్క ప్రెస్‌మీట్‌తో రెండు దేశాల సంబంధాలు దెబ్బతింటాయా?” అని ఆమె వ్యాఖ్యానించారు. తనకు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉందని, ప్రజలకు నిజాలు చెప్పడమే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. 2024 ఆగస్టు 5న దేశం విడిచి భారత్‌కు రావడం తన నిర్ణయం కాదని, పరిస్థితుల కారణంగానే భద్రత కోసం తనను భారత్‌కు తీసుకొచ్చారని తెలిపారు. భారత్ తనకు ఆశ్రయం కల్పించి భద్రత కల్పించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లాలన్న తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని హసీనా స్పష్టం చేశారు.
అవామీ లీగ్‌పై నిషేధం ఎత్తేయాలని డిమాండ్
తనపై హత్య కేసులో మరణశిక్ష విధించినా.. బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని హసీనా తెలిపారు. తన పార్టీ అవామీ లీగ్‌పై నిషేధం ఎత్తివేయాలని, రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, తప్పుడు కేసులను ఉపసంహరించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. దేశంలో స్వేచ్ఛా భావ ప్రకటన దెబ్బతిందని, మీడియా సంస్థలపై దాడులు జరిగాయని, జర్నలిస్టులపై కేసులు నమోదయ్యాయని ఆమె ఆరోపించారు. 2024లో జరిగిన హింసకు తనను వ్యక్తిగతంగా బాధ్యురాలిగా చేయడాన్ని కూడా ఆమె తిరస్కరించారు. పోలీసులు తమ విధి ప్రకారం పరిస్థితులను ఎదుర్కొన్నారని, ప్రతి చర్యకు ప్రధానమంత్రిని సంప్రదించడం సాధ్యం కాదని అన్నారు. తన పార్టీకి చెందిన వేలాది మంది కార్యకర్తలు హత్యలు, అరెస్టులు, వేధింపులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. అవామీ లీగ్‌కు ఎవరు నాయకత్వం వహించాలన్నది పార్టీ రాజ్యాంగ ప్రకారం పార్టీ నిర్ణయిస్తుందని, తాను పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధమే కానీ.. పార్టీ నాయకత్వాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం నిర్ణయించలేదని చెప్పారు. 2024లో జరిగిన విద్యార్థి ఉద్యమం కేవలం కోటా వ్యవస్థకు వ్యతిరేక నిరసన కాదని, తన ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యంగా సాగిందని హసీనా ఆరోపించారు.
#SheikhHasina #IndiaBangladeshRelations #IndiaBangladeshTies #BangladeshPolitics #AwamiLeague #SheikhHasinaIndia #HasinaPressConference #BangladeshCrisis #BangladeshFormerPM #AwamiLeagueBan #BangladeshProtests #IndiaBangladesh #BangladeshPoliticalCrisis #SheikhHasinaReturn #SouthAsiaPolitics











