వైఎస్ చివరి కోరిక అదేనన్న సీఎం రేవంత్ రెడ్డి .
ఢిల్లీలో జరిగిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026 కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను కాంగ్రెస్ శ్రేణులు ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. దేశ నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఆయన గుర్తుచేశారు. తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ విద్య, సాగునీటి రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారని, ఆయన ముందుచూపుతో దేశం ఆకలి కేకల నుంచి ఆహార ఎగుమతులు చేసే స్థాయికి చేరిందని అన్నారు. రైతులు పండించే పంటకు మద్దతు ధర అందించే వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత ఇందిరాగాంధీకి దక్కుతుందని చెప్పారు. పేదలకు అసైన్డ్ భూములు పంపిణీ చేయడం, పీడీఎస్ ద్వారా రేషన్ సరుకులు అందించడం వంటి చర్యలు కాంగ్రెస్ పాలనలోనే జరిగాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
రైతు గుండెల్లో వైఎస్ స్థానం
దేశంలోని ప్రతి ఒక్కరికీ ఆహార భద్రత కల్పించేందుకు సోనియా గాంధీ హయాంలో ఆహార భద్రత చట్టం తీసుకొచ్చారని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం 3 కోట్ల 48 లక్షల మందికి సన్న బియ్యం అందిస్తున్నామంటే, గత కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన సంక్షేమ వ్యవస్థలే కారణమని అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేసిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని గుర్తుచేశారు. అప్పట్లో ₹1,300 కోట్ల విద్యుత్ బకాయిలను రద్దు చేసి, రైతులపై ఉన్న కేసులను ఎత్తివేసి ఆయన రైతుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారని చెప్పారు. తెలంగాణకు సాగునీరు అందించేందుకు ప్రాణహిత-చేవెళ్ల, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వంటి ప్రాజెక్టులకు వైఎస్ శ్రీకారం చుట్టారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఆ కోరిక నెరవేర్చడమే నివాళి
వైఎస్ ప్రారంభించిన ప్రాణహిత-చేవెళ్ల, ఎస్ఎల్‌బీసీ పనులు ప్రస్తుతం ఆగిపోయాయని రేవంత్ రెడ్డి అన్నారు. వైఎస్ ఆశయాలను నూటికి నూరు శాతం కొనసాగిస్తామని, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణ సమాజానికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ అభిమానులకు ఆయన కీలక సందేశం ఇచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే తన జీవిత లక్ష్యమని చెప్పారని, ఆ కోరిక నెరవేరకుండానే ఆయన మరణించారని గుర్తుచేశారు. దేశ ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో నాయకుడు వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. దేశానికి బలమైన నాయకుడు రాహుల్ గాంధీ అని, ఆయనను ప్రధానమంత్రిని చేయడమే వైఎస్‌కు నిజమైన నివాళి అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు వైఎస్ అభిమానులు మద్దతు ఇవ్వాలని కోరారు. మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ శ్రేణులంతా కలసి పనిచేసి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని పిలుపునిచ్చారు.
#RevanthReddy #RahulGandhi #YSR #YSRajasekharaReddy #YSRAwards2026 #Congress #RahulGandhiPM #TelanganaPolitics #CongressParty #MallikarjunKharge #YSRLegacy #YSRFans #IndianPolitics











