Home Telangana ఫీజు బకాయిలతో విద్యకు తూట్లు!

ఫీజు బకాయిలతో విద్యకు తూట్లు!

రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై ఆగ్రహం.
రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్.

ప్రపంచస్థాయి విద్యా వ్యవస్థ అంటూ గొప్పలు చెప్పుకునే సీఎం రేవంత్‌రెడ్డి.. నెలలు గడుస్తున్నా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడం సిగ్గుచేటని బీఆర్‌ఎస్‌ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. గత రెండున్నరేళ్లుగా నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో తెలంగాణలోని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయని ఆరోపించారు. అధ్యాపకులు, నాన్‌టీచింగ్ సిబ్బందికి నెలల తరబడి జీతాలు అందడం లేదని, అద్దెలు, విద్యుత్ బిల్లులు, యూనివర్సిటీ ఫీజులు, నిర్వహణ ఖర్చులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.

650కి పడిపోయిన కళాశాలలు

ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఒకప్పుడు రాష్ట్రంలో సుమారు 960గా ఉన్న ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఇప్పుడు దాదాపు 650కి తగ్గిపోయాయని, ఇప్పటికే 310 వరకు కళాశాలలు తగ్గాయని హరీశ్‌రావు తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరిన్ని కళాశాలలు మూతపడే ప్రమాదం ఉందన్నారు. దీని ప్రభావం గ్రామీణ తెలంగాణపై ఎక్కువగా పడుతుందని, చిన్న పట్టణాలు, మండలాల్లో ప్రైవేట్ కళాశాలలే పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్యకు ప్రధాన ఆధారమని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ భరోసాగా నిలిచిందని గుర్తుచేశారు. కళాశాలలు మూతపడితే వేలాది మంది విద్యార్థుల ఉన్నత విద్యకు ఆటంకం ఏర్పడుతుందని హెచ్చరించారు.

రూ.10 వేల కోట్ల బకాయిలంటూ ఆరోపణ

బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రూ.2,500 కోట్ల బకాయిలు ఉన్నాయని, వాటిని చెల్లించి పథకాన్ని కొనసాగించామని హరీశ్‌రావు చెప్పారు. పెద్ద నోట్ల రద్దు, కరోనా సమయంలోనూ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆపలేదన్నారు. తొమ్మిదిన్నరేళ్లలో రూ.19,500 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌గా కేసీఆర్ ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పాత బకాయిలతో పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్ పూర్తిగా చెల్లిస్తామని హామీ ఇచ్చిందని, మూడు బడ్జెట్లు పూర్తయినా దాదాపు రూ.10 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని ఆరోపించారు. పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేయాలని, ప్రతి విద్యా సంవత్సరానికి నిర్ణీత గడువులో నిధులు చెల్లించే శాశ్వత విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు. బకాయిలు విడుదల చేయకపోతే అసెంబ్లీని స్తంభింపజేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

 

#FeeReimbursement #TelanganaEducation #HarishRao #RevanthReddy #BRS #TelanganaPolitics #FeeReimbursementDues #PrivateColleges #DegreeColleges #HigherEducation #TelanganaNews #StudentIssues #CollegeCrisis