తెలంగాణలో 22ఏ భూముల అంశంపై వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. లక్షలాది ఎకరాలను కొత్తగా నిషేధిత జాబితాలో చేర్చారన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. 2023 డిసెంబర్ 7న ఉన్న పరిస్థితి, ప్రస్తుత పరిస్థితి, ఏ కేటగిరీ భూములు 22ఏలో ఉన్నాయో రికార్డులతో ప్రజలకు వివరిస్తామని తెలిపారు. ప్రభుత్వ, అసైన్డ్, భూదాన్, వక్ఫ్, దేవాదాయ, అటవీ భూములను ప్రైవేట్ వ్యక్తులకు మళ్లించకుండా కాపాడటమే 22ఏ నిబంధనల ఉద్దేశమని చెప్పారు. ప్రభుత్వ భూములను ప్రైవేట్ ఆస్తులుగా చూపించి రిజిస్ట్రేషన్లు చేసుకునే ప్రయత్నాలను సహించబోమన్నారు.
నకిలీ పత్రాలపై క్రిమినల్ కేసులు
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వ భూములకు హక్కులు కల్పించిన ఘటనలను మంత్రి ఉదాహరణగా ప్రస్తావించారు. నర్సాపూర్ పరిధిలో వందల ఎకరాల ప్రభుత్వ భూముల వ్యవహారం, సంగారెడ్డి పోతిరెడ్డిపల్లిలో సరైన రికార్డులు లేకుండానే హక్కులు సృష్టించిన ఘటనలను పరిశీలిస్తున్నామని చెప్పారు. నకిలీ జీఓలు, బోగస్ మెమోలు, ఫేక్ సర్టిఫికెట్లతో ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేయించేందుకు ప్రయత్నించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ భూముల విషయంలో అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
98 శాతం రిజిస్ట్రేషన్లు పూర్తి
22ఏ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్‌కు 1,162 కాల్స్ వచ్చాయని, పునరావృత ఫిర్యాదులు తొలగించిన తర్వాత 980 ప్రత్యేక ఫిర్యాదులు ఉన్నాయని పొంగులేటి తెలిపారు. వీటిలో వ్యవసాయ భూములకు సంబంధించినవి 547, వ్యవసాయేతర భూములకు సంబంధించినవి 433గా వివరించారు. ఇప్పటికే రిలాక్సేషన్ పొందిన కేసుల్లో 98 శాతం రిజిస్ట్రేషన్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. నిజమైన సమస్యలను 24 గంటల్లో, అవసరమైన సందర్భాల్లో గరిష్ఠంగా 36 గంటల్లో పరిష్కరించే ఫాస్ట్‌ట్రాక్ విధానం అమల్లో ఉందన్నారు. ప్రజలను భయపెట్టడం కాదు.. న్యాయబద్ధమైన ఆస్తులకు రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
#PonguletiSrinivasReddy #Ponguleti #22ALands #22AProperties #TelanganaRevenue #GovernmentLands #TelanganaLands #LandRegistration #LandDisputes #AssignedLands #WaqfLands #EndowmentLands #ForestLands #FakeDocuments #IllegalRegistrations #TelanganaGovernment #RevenueDepartment #TelanganaPolitics #TelanganaNews











