Home Telangana తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో జనసేన

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో జనసేన

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీనివాసరావు
ముందుగానే అభ్యర్థి ప్రకటన.. పవన్ వ్యూహం

తెలంగాణలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై జనసేన ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టింది. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి డాక్టర్ గడల శ్రీనివాసరావును అభ్యర్థిగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇతర పార్టీల కంటే ముందుగానే అభ్యర్థిని ఖరారు చేయడం ద్వారా ఎన్నికల కార్యాచరణకు జనసేన శ్రీకారం చుట్టింది. వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచారం, ఓటర్ల నమోదు, పార్టీ శ్రేణుల సమన్వయంపై ముందస్తుగా దృష్టి పెట్టే అవకాశం ఏర్పడింది. పార్టీ నేతలు నేమూరి శంకర్ గౌడ్, రామ్ తాళ్లూరి ప్రతిపాదనతో శ్రీనివాసరావు పేరును అధిష్ఠానం పరిశీలించి ఆమోదించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

మాజీ హెల్త్ డైరెక్టర్‌పై జనసేన ఆశలు
గడల శ్రీనివాసరావు గతంలో తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడిగా పనిచేశారు. వైద్య, పరిపాలనా రంగాల్లో ఆయనకు ఉన్న అనుభవాన్ని జనసేన ప్రధానంగా పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పట్టభద్రులు, ఉద్యోగులు, నిరుద్యోగ యువత సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఎన్నికల బరిలోకి దిగాలని పార్టీ భావిస్తోంది. పదవీకాలం మార్చిలో ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. బలమైన పోటీ ఇవ్వడమే లక్ష్యంగా జనసేన ముందస్తు వ్యూహంతో అడుగులు వేస్తోంది. పవన్ కల్యాణ్ ఆమోదంతో అభ్యర్థి ప్రకటన జరగడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచింది.

 

#JanaSena #PawanKalyan #GadalaSrinivasaRao #TelanganaMLCElections #GraduateMLC #Khammam #Nalgonda #Warangal #JanaSenaTelangana #TelanganaPolitics #MLCPolls #GraduateConstituency #PawanKalyanStrategy #TelanganaNews #JanaSenaCandidate