Home National_news జడ్జి కావాలంటే…! ఏడాది ప్రాక్టీస్ చాలు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

జడ్జి కావాలంటే…! ఏడాది ప్రాక్టీస్ చాలు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

సివిల్ జడ్జి నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక మార్పు చేసింది. 2025 మేలో ఇచ్చిన తీర్పులో నిర్దేశించిన మూడేళ్ల న్యాయవాద అనుభవాన్ని ఒక సంవత్సరానికి తగ్గించింది. శుక్రవారం ఇచ్చిన 2:1 మెజారిటీ తీర్పులో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఏజీ మసీహ్ ఈ నిర్ణయం వెల్లడించారు. ఏడాది న్యాయవాద ప్రాక్టీస్ పూర్తి చేసిన అభ్యర్థులు ఎంపికైతే వెంటనే రెగ్యులర్ జడ్జీలుగా కాకుండా రెండేళ్ల శిక్షణ వ్యవస్థలోకి వెళ్తారు. తొలుత ఏడాది రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీలో శిక్షణ, తరువాత ఏడాది సీనియర్ న్యాయాధికారులు, హైకోర్టు జడ్జీల వద్ద లా క్లర్క్‌షిప్ చేయాలి.

ట్రాన్సిషన్ అభ్యర్థులకు వెసులుబాటు

2025 మే తీర్పు తరువాత రివ్యూ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్న సమయంలో సివిల్ జడ్జి పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు సుప్రీంకోర్టు ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. ఆ కాలంలో దరఖాస్తు చేసిన వారికి ఏడాది ప్రాక్టీస్ పూర్తయినట్టుగా పరిగణిస్తారు. ప్రాక్టీస్ సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవసరం ఉండదు. పరీక్షల్లో అర్హత సాధించిన వారు ట్రైనీ జ్యుడీషియల్ ఆఫీసర్లుగా నియమితులై ఒక సంవత్సరం అకాడమీ శిక్షణ పొందుతారు. తరువాత ఆరు నెలలు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ లేదా డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి వద్ద, మరో ఆరు నెలలు సంబంధిత హైకోర్టు సిట్టింగ్ జడ్జి వద్ద శిక్షణ పొందుతారు. ఈ విధానం 2027 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది.

2027 నుంచి కొత్త నిబంధన

2027 ఏప్రిల్ 1 నుంచి ఏడాది న్యాయవాద ప్రాక్టీస్ తప్పనిసరిగా అమల్లోకి వస్తుంది. అభ్యర్థి కోర్టు విచారణల్లో వాస్తవంగా పాల్గొన్నట్లు నిరూపించే ‘ప్రాక్టీస్ ప్రూఫ్ సర్టిఫికెట్’ సమర్పించాలి. కనీసం పదేళ్ల అనుభవం ఉన్న సీనియర్ న్యాయవాదితో కలిసి కోర్టు వ్యవహారాల్లో పాల్గొన్న రికార్డుల ఆధారంగా ఈ సర్టిఫికెట్ ఇవ్వనున్నారు. ఎంపికైన అభ్యర్థులు రెండేళ్ల శిక్షణ, లా క్లర్క్‌షిప్ పూర్తిచేసిన తరువాతే రెగ్యులర్ జ్యుడీషియల్ ఆఫీసర్లుగా నియమితులవుతారు. ఈ విధానం ఐదేళ్ల పాటు అమలులో ఉండి తర్వాత దాని ఫలితాలను సమీక్షించనున్నారు. అయితే జస్టిస్ వినోద్ చంద్రన్ మెజారిటీ నిర్ణయంతో విభేదించారు. న్యాయ విద్య పూర్తిచేసిన యువతకు కోర్టు అనుభవం తప్పనిసరని, న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే ముందు కక్షదారు సమస్యలను అర్థం చేసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.

 

#SupremeCourt #CivilJudge #JudicialServices #LegalPractice #JudicialRecruitment #CJI #SuryaKant #AGMasih #JudicialOfficers #Lawyers #LegalNews #IndianJudiciary #JudicialAcademy #LawClerkship #PracticeProof #SupremeCourtVerdict